రైల్వే రూట్ ఉంటె ఆ ప్రాంతం తప్పకుండా డెవలప్ అవుతుంది.  ఆ ప్రాంతం నుంచి డబ్బు వస్తుంది అంటేనే రైల్వే అధికారులు రైల్వే లైన్ వేస్తారు.  కనీసం మరీ ఎక్కువ కాకపోయినా  కొంత మొత్తంలో అయినా ఆదాయం వస్తుంది.  అలా ఆదాయం రాకుండా ఎవరూ కూడా ఉత్తపుణ్యానికే రైల్వే లైను వేయరు.  ఆదాయం లేకుండా ఎందుకు ఆ పనిచేస్తారు చెప్పండి.  దేశంలో ఏ చిన్న రైల్వే స్టేషన్ నుంచి చూసుకున్నా ఆదాయం భారీగానే ఉంటుంది.  


అయితే, ఓ రైల్వే స్టేషన్ నుంచి మాత్రం ఆదాయం దారుణంగా ఉందట. రోజుకు ఆ స్టేషన్ నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలిస్తే నిజంగా నోరెళ్లబెడతారు.  ప్రతిరోజూ ఆ స్టేషన్ నుంచి కేవలం రూ. 20 మాత్రమే వస్తుందట.  నెలవారీ ఖర్చులు, మెయింటైన్ అన్నింటికీ తడిసి మోపెడు అవుతుంది. ఆ స్టేషన్ నుంచి రోజు ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణం చేస్తుంటారు.  అక్కడెక్కడో జపాన్ లో కేవలం ఒకే ఒక్క స్టూడెంట్ కోసం రైల్వే లైన్ వేసి రైలు నడుపుతున్నట్టుగా, ఇక్కడ ఇద్దరు ప్రయాణికుల కోసం రైలు నడుపుతున్నట్టుగా ఉన్నది.  


ఈ రైల్వే లైన్ ను గతేడాది ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించారు.  ఈ రైల్వే లైన్ వేయడానికి, స్టేషన్ కోసం దాదాపుగా రూ. 115 కోట్లు ఖర్చు చేశారు.  అయితే, ఇంత గొప్ప రైల్వే స్టేషన్ ఎక్కడుందని ఆశ్చర్యపోతున్నారా అక్కడికే వస్తున్నా.  ఈ రైల్వేస్టేషన్ ఒడిశాలోని బోలంగిర్ జిల్లాలోని బిచ్చుపాలిలో ఉన్నది.  అప్పట్లో ఈ రైల్వే లైన్ కోసం భారీ డిమాండ్ ఉండటంతోనిర్మించారు .  కానీ కేవలం రోజుకు రూ. 20 ఆదాయం వస్తుండటంతో షాక్ అవుతున్నారు.  


ఇక ఈ బిచ్చుపాలి రైల్వేలైన్ ను సోనేపూర్ రైల్వే లైన్ కు కనెక్ట్ చేస్తే ఆదాయం పెరగడమే కాకుండా ఈ రూట్ లో రైల్ రాకపోకలు బాగుంటాయని అంటున్నారు.   బోలంగిర్ నుంచి బిచ్చుపాలి వరకు మొత్తం 16.8 కిలోమీటర్ల మేర ఈ లైన్ ను నిర్మించారు.  అయితే, ఈ స్టేషన్ నిర్వహణ కోసం నెలకు ఎంతవరకు ఖర్చులు అవుతున్నాయి అనే విషయాన్నీ మాత్రం అధికారాలు చెప్పడం లేదు.  అసలే రైల్వే వ్యవస్థ ఇప్పుడిప్పుడే లాభాల బాటపడుతున్నది.  ఈ సమయంలో ఇది రైల్వే వ్యవస్థకు పెద్ద దెబ్బె అని చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: