కొత్త మిత్రుల మధ్య అప్పుడే విభేదాలు మొదలయ్యాయా ? మీడియా ముందు  ఉమ్మడి సమావేశం సందర్భంగా బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటల సందర్భంగా ఈ విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా ఇద్దరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయటం వరకూ ఓకేనే. మరి హై కోర్టు విషయానికి వచ్చేసరికి ఇద్దరి మాటల్లో పూర్తి వ్యతిరేకత కనిపించింది.

 

మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలన్నఅంశాన్ని తాము స్వాగతిస్తున్నట్లు కన్నా ప్రకటించారు. కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయాలని తమ పార్టీ ఎప్పుడో డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.  అయితే తర్వాత మాట్లాడిన పవన్ మాత్రం కర్నూలులో హై కోర్టు ఏర్పాటును వ్యతిరేకించారు. అసలు హై కోర్టు ఏర్పాటు అధికారం జగన్ చేతిలో ఉందా అంటూ నిలదీశారు.

 

తమ లెక్క ప్రకారం సచివాలయం, అసెంబ్లీ, హై కోర్టు అన్నీ ఒకేచోట ఉండాలంటూ డిమాండ్ వినిపించారు. అంటే ఇక్కడే  ఒకే అంశంపై రెండు పార్టీల నేతలు భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.  పవన్ చేసిన ప్రతి డిమాండ్ చంద్రబాబునాయుడు చేస్తున్న డమాండ్లే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకాలం చంద్రబాబు వాయిసే తన  వాయిస్ గా వినిపించిన పవన్ తాజాగా  బిజెపితో జత కట్టడంతో ద్వారా కొత్తగా వినిపించబోతున్నారు. కాకపోతే హై కోర్టు విషయంలోనే కన్నా-పవన్ ఆలోచనలోని తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

 

మొదటి సమావేశంలోనే  హై కోర్టు ఏర్పాటు  లాంటి  కీలక అంశంపై మీడియా సమావేశంలోనే పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను బాహాటంగానే వ్యక్తం చేసిన ఈ ఇద్దరు నేతలు భవిష్యత్తులో మాత్రం కలిసి ఏకాభిప్రాయంతో ఎలా పనిచేయగలుగుతారు ?  బహుశా ముందుముందు ఏ విషయంపైన కూడా అసలు పవన్ మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. ఆ పరిస్దితే వస్తే పవన్ ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: