రాష్ట్రంలో రెండూ విడి విడిగా ప్రభావం చూపించే శక్తులు కాకున్నా, రెండూ కలిస్తే కొంత ప్రభావమే కాదు, శ్రేణుల్లో కొండంత ధైర్యం నింపేదే. ఇది రాజకీయ ఎదుగుదల, విస్తరణకు పనికి వచ్చేదయినా.. మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్న వై ఎస్ జగహన్మోహాన్ రెడ్డి దారి మరింత సుగమం చేస్తుంది. మొత్తానికి వీరి సంక్రమణంతో   సంక్రమణ ఏపీ  రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. కొందరు అగ్రనేతలు పార్టీలు మారినా, మరికొందరు నేతలు అభద్రతా భావంతో ఉన్నప్పటికీ, 40 శాతం ఓటు శాతం సాధించిన టిడిపి ఒంటరిగా పోటీ చేస్తుంది. ఆ క్రమంలో  ప్రభుత్వ వ్యతిరేక ఓటును బిజెపి-జనసేన కొంతమేర చీలిస్తే, అది వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే. కాగా తాజా పరిణామాలు అటు బిజెపి ఎదుగుదల, విస్తరణకు దోహదపడేవే. ఎందుకంటే గత ఎన్నికల్లో పది శాతం ఓట్లు సాధించిన జనసేనతో కలయిక, బిజెపికి రాజకీయంగా లాభించే అంశమే. ఇప్పుడు కాపులు గంపగుత్తగా బిజెపి వైపు రావచ్చు.

ఏపీలో పాగా వేయాలని అవకాశం కోసం ఎదురుచూస్తున్న బిజెపికి, జనాకర్షణ శక్తి ఉన్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ తోడవడం కలసివచ్చే అంశమే.  కొత్తగా పొడిచిన పొత్తు బంధం ఆ రెండు పార్టీలలో కొత్త ఆశలు నింపేవే. విడిగా జీవిస్తున్న ఇరు పార్టీల ‘తోడు కలయిక’ రాజకీయ సహజీవనానికే కాకుండా, వారి లక్ష్యానికి చేరువయేలా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో తాను ఒంటరయ్యానని, జగన్ సర్కారు తన పార్టీ శ్రేణులను కూడా బతకనిచ్చేలా లేదని, చివరకు తన పార్టీ ఎమ్మెల్యేను కూడా తనకు దూరం చేసిందని గ్రహించిన తర్వాతనే బిజెపి శరణు కోరారు. తాను ఒంటరిగా ఉంటే ఎదుగుదల అటుంచి, రాజకీయ ఉనికి కూడా ప్రమాదమేనన్న వాస్తవాన్ని ఆయన ఆలస్యంగా గ్రహించినట్లున్నారు. అదే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలసి ఉంటే, ఇప్పటిలా జనసైనికులపై జగన్ పార్టీ కాళ్లు దువ్వే సాహసం చేయదని భావించి, అర్జంటుగా ఢిల్లీ ఫ్లైైటెక్కారు. అంటే పవన్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నట్లు కనిపిస్తోంది. అనుభవమయితే గానీ తత్వం బోధపడదు కదా మరి?
 ఇక ఇప్పుడు జనసైనికులు స్వేచ్ఛగా రాజకీయాలు చేయవచ్చు. వైసీపీని చూసి భయపడాల్సిన పనిలేదు. అది ఒకరకంగా జనసేనకు ఊరట.  స్థానిక సంస్థలు జరిగితే... వైసీపీ ఒకవైపు, బిజెపి-జనసేన మరొకవైపు, టిడిపి ఇంకో వైపు బరిలోకి దిగితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి, అది అంతిమంగా వైసీపీకే లాభించడం ఖాయం. అయితే.. బిజెపి-జనసేన పొత్తు వైసీపీకి ప్రమాదఘంటికనే. కానీ, ఇప్పటిదాకా జనసేన అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఏ ఫ్రేము చూసినా పవనే కనిపిస్తారు. తాజా కలయికతోనయినా క్యాడర్‌ను పెంచుకుని, పార్టీ నిర్మాణంపై దృష్టి సారిస్తేనే ఫలితం. ఆ పార్టీకి బిజెపి మాదిరిగా ఇప్పటిదాకా నగర, పట్టణ, గ్రామ, మండల కమిటీలు లేవు. పైగా అభిమానులే జనసేనకు వరం, శాపం.. మొన్నటి వరకూ తాను కాపునని చెప్పడానికి పవన్ మొహమాటపడటం, అన్నయ్య చేసిన మోసం, జనసేన అభ్యర్ధుల్లో సమర్ధులు లేకపోవడటం వంటి కారణాలతో కాపులు జనసేనను సొంతం చేసుకోలేకపోయారు. బిజెపితో కలయిక తర్వాత ఆ పరిస్థితిలో మార్పు రావచ్చు. దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటారన్న దానిపైనే పవన్ సమర్థత ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: