రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నది.  అమరావతికి సంబంధించిన రగడ గత నెలరోజులుగా జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.  పైగా రాజధాని అమరావతి ప్రాంతంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా 144 సెక్షన్ అమలులో ఉన్నది.  మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.  అయితే, ఈనెల 20న ఏపి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి విశాఖకు కార్యనిర్వాక రాజధానిని మార్చాలని చూస్తున్నారు.  

 

దీనిపైనే సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి.  ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నాయి.  తాను పట్టిందే పట్టు అనే రీతిలో జగన్ ప్రవర్తిస్తున్నారు.  అక్రమాస్తుల కేసులో ఈరోజు జగన్ సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నది.  కానీ, జగన్ కోర్టుకు హాజరుకాలేదు.  హైపవర్ కమిటీ మీటింగ్ ఉండటం వలన అయన హాజరు కాలేకపోయారు.  ఆయనకు బదులుగా నిందితులగా ఉన్న ధర్మాన, సబితా ఇంద్రా రెడ్డిలు హాజరయ్యారు.  


ఈరోజు హాజరు కాకపోవడంపై కోర్టు అభ్యంతరం చెప్పలేదు.  అయితే, 24 వ తేదీన దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోబోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నారు.  రేపు ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవబోతున్నారు.  నిన్నటి రోజున జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.  రెండు పార్టీలు కలిసి అమరావతి విషయంలో రైతుల పక్షాన నిలబడాలని చూస్తున్నారు. 


అదే విధంగా ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయబోతున్నారు. ఇది జరిగిన మరుసటి రోజే జగన్ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోరడం, దానికి అమిత్ సరే అని చెప్పడంతో అసలు ఏం జరగబోతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఏ విషయాలపై చర్చించబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది.  అందుతున్న సమాచారం ప్రకారం కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా దానికి సంబంధించిన అంశాలు, లా అండ్ ఆర్డర్ విషయం గురించి, పోలీస్ వ్యవస్థ ఏర్పాటు గురించి జగన్ అమిత్ షాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: