మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన బీజేపీ.. రెండు కార్పొరేషన్, 15 మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించింది. పురపాలనలో గులాబీ దళం వైఫల్యం చెందిందంటూ చార్జిషీటు విడుదల చేసిన కమలదళం...తమ మేనిఫేస్టోను ప్రకటించి సత్తా చాటాలని చూస్తోంది.

 

తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి మేమే ప్రత్యమ్నాయమంటున్న బీజేపీ.. ఆ దిశగా మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు పథకాలు రచిస్తోంది. అన్ని వార్డుల్లో పోటీ చేయలేక పోయినా.. పోటీ చేసిన స్థానాల్లో మాత్రం ప్రభావం చూపేందుకు కసరత్తు ప్రారంభించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకున్న కాషాయ పార్టీ మున్సిపాలిటీలను నాలుగు భాగాలుగా విభజించింది. తాము ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిసైడ్ అయ్యింది. ఆయా స్థానాల్లో టీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదని ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. 

 

టీఆర్‌ఎస్ పార్టీపై నాలుగు పేజీల ఛార్జ్‌షీట్ విడుదల చేసిన కాషాయ పార్టీ.. గతంలో ఇచ్చిన హామీలేవి నెరవేర్చలేదని తెలిపింది. తమ కుటుంబంలో అందరికి పదవులు కట్టబెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదని విమర్శలు గుప్పించింది. అన్ని పార్టీల కంటే ముందు రెండు కార్పొరేషన్, 15 మున్సిపాలిటీలకు ఛైర్మన్ అభ్యర్ధులను ప్రకటించింది బీజేపీ.

 

నిజాంపేట్ కార్పొరేషన్‌కి కొలను నీరజ హనుమంత రెడ్డి, మీర్‌పేట్ కార్పొరేషన్‌కి నీల రవికుమార్‌లను మేయర్ అభ్యర్ధులుగా ప్రకటించిన బీజేపీ... జనగామ, ఇల్లెందు, వనపర్తి, దేవరకొండ, మణికొండ, ఆదిభట్ల, కోస్గి, చౌటుప్పల్, నల్గొండ, కొంపల్లి, కొడంగల్‌, దేవరకొండ, ఆత్మకూరు, అమరచింత, బూత్పూర్ స్థానాలను ఛైర్ పర్సన్ అభ్యర్ధులను ప్రకటించింది.

 

మరోవైపు ఎన్నికల ప్రచారానికి ముఖ్యనేతలను కూడా రంగంలోకి దించింది బీజేపీ. కేంద్ర సహాయ హోం మంత్రి కిషన్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంటులో ప్రచారం చేస్తే.. లక్ష్మణ్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ప్రచారం చేశారు. మురళీధర్‌ రావు, రాజాసింగ్‌లు కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఇక ఒకటీ రెండు రోజుల్లో మేనిఫేస్టో కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది బీజేపీ. మొత్తం స్థానాల్లో అభ్యర్ధులను నిలపకపోయినా.. నిలిపిన చోట సత్తా చాటి ప్రత్యర్ధుల విమర్శలకు చెక్‌ పెట్టాలని చూస్తోంది కాషాయ పార్టీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: