రాజధాని అమరావతి గ్రామాల్లోని రైతులకు ప్యాకేజి పెరగబోతోందా ? మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పిన విషయాలను బట్టి అందరికీ అదే అర్ధమవుతోంది.  రాజధాని వివాద పరిష్కారానికి ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటి సభ్యులు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో భేటి అయ్యారు.  కమిటిలో సభ్యుడైన మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇపుడిస్తున్న ప్యాకేజికన్నా మెరుగైన ప్యాకేజిపై కసరత్తు చేయమని ఆదేశించినట్లు  చెప్పారు.

 

బొత్స మాటలు చూస్తుంటే రైతుల్లోని ఆందోళనను విరమింపచేసేందుకు చంద్రబాబునాయుడు హయాంలో ఫిక్సయిన ప్యాకేజికన్నా మెరుగైన ప్యాకేజి ఇవ్వటానికి జగన్ రెడీ అయినట్లు అర్దమవుతోంది. ప్రస్తుతం జరీబు భూమి ఎకరాకు ఏడాదికి రూ. 50 వేలు, మాగాణి భూములకు ఏడాదికి రూ. 30 వేల కౌలు అందుకుంటున్నారు. అలాగే ఇంటిస్ధలం క్రింద భూములిచ్చిన జరీబు రైతులకు వెయ్యి గజాలు, కమర్షియల్ ప్లాటు క్రింద 400 గజాలు ఇస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన రైతులకు వెయ్యి గజాల ఇంటిస్ధలం, కమర్షియల్ ప్లాటుగా 200 గజాలు హామీ ఇచ్చింది.

 

ఇక్కడ హమీ అని ఎందుకంటున్నామంటే భూములు తిసుకున్న చంద్రబాబు వారికిస్తానన్న ఇంటిప్లాటు, కమర్షియల్ ప్లాట్లను చాలామందికి కాగితాల మీద మాత్రమే చూపించారు. అదే విషయాన్ని బొత్స మాట్లాడుతూ ప్రస్తుత ప్యాకేజికన్నా మెరుగైన ప్యాకేజి ఇద్దామని జగన్ ఆదేశించినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఏడాదికిస్తున్న కౌలును పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

అలాగే తమ భూములను తిరిగి తీసుకోవటానికి ముందుకొచ్చే రైతులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని కూడా అనుకుంటున్నారట. అంటే భూములను తిరిగి వ్యవసాయయోగ్యంగా చేయటం. గడచిన నాలుగున్నరేళ్ళుగా వ్యవసాయం చేయకపోవటంతో భూములన్నీ దెబ్బతిన్నాయి. కాబట్టి భూములు దున్నించటం, విత్తనాలు, ఎరువులు, మార్కెట్ సౌకర్యాలు కల్పించటం లాంటివి చేయాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నాలుగైదు గ్రామాల రైతులు మంత్రులతో సమావేశమయ్యారు. కాబట్టి మంత్రులతో చర్చలు ఫలవంతమైతే ఆందోళన తొందరలోనే మాయమైపోవటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: