గణతంత్ర దినోత్సవానికి ముందు భారీ విధ్వంసాలకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు ఐదుగుర్ని శ్రీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద పెద్ద మొత్తంలో లభ్యమైన పేలుడు పదార్థాలను బట్టి ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. 

 

మనపై పగతో రగిలిపోతున్న పాకిస్థాన్‌ విధ్వంసాలకు కుట్రలు చేస్తూనే ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం... గణతంత్ర దినోత్సవం వస్తోందంటే చాలు పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు విధ్వంసాలకు తెగబడాలని చూస్తున్నారు. తాజాగా, జమ్మూ-కాశ్మీర్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు పోలీసులు.  

 

రిపబ్లిక్‌ డే సందర్భంగా విధ్వంసానికి కుట్ర పన్నింది జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ.  అయితే శ్రీనగర్‌లో గల ఉగ్రవాదుల అడ్డాపై దాడి చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాయి భద్రతా దళాలు. వీళ్లను అజీజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సహిల్‌ ఫరూక్‌ గోజ్రి, నజీర్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల శిబిరం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లు, తేలిక పాటి ఆయుధాలు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు.

 

ముఖ్యంగా... బాంబులు, బాల్‌ బేరింగ్‌లు అతికించిన ఓ బాడీ వేస్ట్‌ లభ్యం కావడం ఆందోళన కలిస్తోంది. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసేందుకు దానిని సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు అధికారులు. అలాగే నైట్రిక్‌ యాసిడ్‌ బాటిళ్లు లభ్యం కావడంతో... ఉగ్రవాదులు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కాగా అరెస్ట్ అయిన ఐదుగురిలో ఇద్దరు ఇటీవల హజ్రత్‌బల్‌ ప్రాంతంలో భద్రతా దళాలపై గ్రెనేడ్‌ దాడి చేసినట్టు చెబుతున్నారు పోలీసులు. 

 

గత ఏడాది పుల్వామాలో జైషే మహ్మద్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి చేసింది. ఆ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దాడికి కుట్ర పన్నినా... భద్రతా దళాలు భగ్నం చేయడంతో పెద్ద ముప్పు తప్పంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: