ప్రాజెక్టులు జనానికి ఎంత మేలు చేస్తాయో మరి కొందరికి అంతే కష్టాలు కలిగిస్తాయి. ఇందుకు విజయనగరం జిల్లాలోని మడ్డువలస ప్రాజెక్ట్‌ నిలువెత్తు సాక్ష్యం. సాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఓ ప్రాజెక్టు ఆ గ్రామాలకు శాపంగా మారింది. అధికారులెవరు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

 

శ్రీకాకుళం జిల్లాలో సువర్ణముఖి నదిపై రెండు దశాబ్ధాల క్రితం మడ్డువలస రిజర్వాయర్ ఏర్పాటైంది. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేయగా.. 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబునాయుడు దాన్ని పూర్తి చేసి జాతికి అంకితమిచ్చారు. ప్రాజెక్టు ద్వారా అనేక గ్రామాలకు సాగు నీరు అందుతున్నప్పటికీ.. నిర్వాసితులుగా మారిన గ్రామాల పరిస్థితి మాత్రం నేటికీ అధ్వాన్నంగానే ఉన్నాయి. ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప నిర్వాసితుల తలరాతలు మారడం లేదు.

 

మడ్డువలస రిజర్వాయర్ నిర్మాణం కారణంగా.. మగ్గూరు, కొటిశ, లక్ష్మిపేట, పెద్ద దేవకివాడ, గుడివాడ, ఓణి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. వెంటనే ఆయా గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించింది ప్రభుత్వం. అయితే.. పాక్షికంగా ముంపునకు గురైన పట్టువర్ధనం, నరేంద్రపురం, చిన్నదేవకివాడ, వి.పి.రాజుపేట, గీతనాపల్లి, నూకలవాడ గ్రామాలు పునరావాసానికి నోచుకోలేదు. రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేసినప్పుడు.. ముంపు గ్రామాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దిశగా అడుగులు వేశారు. అయితే ఆయన మృతి చెందడం. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడంతో ఆ నిధుల పంపిణీ అరకొరగానే సాగింది.  

 

విభజన తర్వాత నిధులు తమ వద్ద లేవని చెప్పిన అధికారులు.. ఆ తర్వాత అవి తమ దగ్గరే ఉన్నట్టు ప్రకటించారు. అధికారుల మాటలకు పొంతన లేకపోవడంతో.. గ్రామస్థులు సమాచార హక్కు చట్టం ద్వారా.. 2015లో కోటి పదిహేను లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్‌లోనే ఉన్నట్టు తెలుసుకున్నారు. ఏళ్లు గడుస్తున్న ప్రభుత్వం వసతులు కల్పించకపోవడంతో కొందరు ఊరు వదిలేసి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం వెళ్లలేక గ్రామంలోనే ఉంటున్నారు. ఇలా గీతనాపల్లి నిర్వాసిత గ్రామంగా మిగిలిపోగా....పటువర్ధనం గ్రామం మాత్రం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పునరావాస వసతులు కల్పించక పోగా.. సంక్షేమ పథకాలు అందకుండా ఉండే పరిస్థితికి తెచ్చారు అధికారులు. పట్టవర్ధనం గ్రామాన్ని జీపీఎస్ నుంచి తొలగించేయండంతో.. రెండేళ్లుగా నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్థులు.

 


సిక్కోలు మ్యాప్‌లో ఈ గ్రామం లేకపోవడంతో.. వారికి రుణాలు కూడా అందడం లేదు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలైనా.. వైసీపీ ప్రభుత్వంలో మాత్రం గ్రామం లేదనే కారణంతో సంక్షేమ పథకాలు అందడం లేదు. సచివాలయం పోస్టులకు అర్హతలు సాధించి కూడా నోటరీ విషయంలో గ్రామం పేరు లేకపోవడంతో ఉద్యోగం పొందలేక పోయారు గ్రామానికి చెందిన యువత. దీంతో వారి బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.

 

ఇదిలా ఉంటే.. కావాలనే పటువర్ధనం గ్రామం పేరును జిల్లా మ్యాప్ నుంచి అధికారులు తొలగించారా... అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా ... సంక్షేమం అందకుండా చేస్తే.. వారంతట వారే.. గ్రామాన్ని ఖాళీ చేసి పోతారనే ఆలోచనలో అధికారుల ఉన్నారనే అనుమానాలు పటువర్ధనం నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: