ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని ప్రకటన చేసిన రోజు నుండి రాజధాని గురించి వివిధ పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం గురించి స్పందించారు. వైసీపీ పార్టీ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తే ఈ నిర్ణయం వైసీపీ పార్టీని ముంచేస్తుందని అన్నారు. 
 
జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయం వలన శాశ్వతంగా రాజకీయాలకు దూరమవుతారని నిమ్మల కిష్టప్ప జోస్యం చెప్పారు. గోరంట్లలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నిమ్మల కిష్టప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలుగా విభజించినందుకు కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో చూశామని ఇప్పుడు వైసీపీకి కూడా అదే గతి పడుతుందని అన్నారు. 
 
విశాఖపట్నం రాజధానిగా అనువైనది కాదని నిమ్మల కిష్టప్ప అన్నారు. మరోవైపు ఈరోజు సీఎం జగన్ తో హై పవర్ కమిటీ సమావేశం ముగిసింది. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను కమిటీ ఈ సమావేశంలో ఇచ్చింది. రెండు రోజుల్లో హై పవర్ కమిటీ తుది నివేదికకు రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎం జగన్ రైతులకు మరింత మేలు చేకూరే విధంగా సూచనలు చేశారని అన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న భవనాలను ఖచ్చితంగా పూర్తి చేస్తామని బొత్స సత్యనారాయణ చెప్పారు. అమరావతి లెజిస్లేటివ్ కాపిటల్ అనే సూచనలు వచ్చినట్టు దీనిపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. తమకు రైతుల పట్ల సానుభూతి ఉందని రైతులు చంద్రబాబు మాయలో మాత్రం పడవద్దని బొత్స సత్యనారాయణ రైతులకు సూచనలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: