యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన బాలికల అత్యాచారం, హత్య కేసు  విచారణ చివరి దశకు చేరుకుంది. నల్గొండలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును విచారిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 300 మంది సాక్ష్యులను ఆరా తీసింది. ఇక శిక్ష ఖరారు కావడమే మిగిలి ఉంది. ఈ నెల 27న నల్గొండ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించనుంది. మరోవైపు నిందితు శ్రీనివాస రెడ్డి తన వాదనను కోర్టు మందుంచాడు. తాను అమాయకుడినని వాదించాడు. 

 

ముగ్గురు అమాయక మైనర్ బాలికలపై  అత్యంత పాశవికంగా  అత్యాచారానికి పాల్పడటమే కాకుండా..  చంపి.. పాడుబడ్డ బావిలో పూడ్చిపెట్టిన సైకో కిల్లర్‌ మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. గతేడాది జులై 31న నల్గొండ పోస్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ముగ్గురు బాలికల హత్య కేసులనూ దశల వారీగా విచారించిన న్యాయస్థానం.. కేసులో అన్ని కోణాలనూ పరిశీలించింది. 

 

2019 ఏప్రిల్ 25న మనీషా అనే విద్యార్థిని కనిపించకుండా పోవడంతో..  హాజీపూర్ గ్రామంలో కలకలం రేగింది. ఆ విద్యార్థినికి సంబంధించిన బ్యాగు మర్రి శ్రీనివాస్ రెడ్డి బావి సమీపంలో లభించడంతో అతడిపై అనుమానం కలిగింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బైక్ పై లిఫ్ట్ పేరుతో మనీషాకు మాయమాటలు చెప్పి బావి వద్దకు తీసుకెళ్లిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి చంపేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బావిలో పూడ్చిపెట్టాడు. గ్రామంలో 2015లో కనిపించకుండాపోయిన ఇద్దరు బాలికలను తనే చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బావిలో తవ్వకాలు జరపగా.. 2015లో అదృశ్యమైన కల్పన, శ్రావణి మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు. చూడాలి మరి.. నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: