ఏపీలో జ‌న‌సేన పార్టీతో పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా బీజేపీ మ‌రోమారు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలోని ప‌రిణామాల సంగ‌తి ఇలా ఉంచితే, దేశంలో బీజేపీ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.  ఎంపిక చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ) శాఖల్లోనే కొనుగోలు చేసేందుకు వీలు ఉన్న ఎలక్టోరల్‌ బాండ్లను ఏ రాజకీయ పార్టీకైనా విరాళంగా ఇవ్వవచ్చు. ఇలా ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బీజేపీ దాదాపు రూ.1,451 కోట్ల విరాళాలను సమీకరించినట్టు ఎన్నికల నిఘా సంస్థ ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌) తెలిపింది. అదే ఏడాది కాంగ్రెస్‌ పార్టీ రూ.918.03 కోట్ల విరాళాలు సేకరించిందని, వీటిలో రూ.383.26 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చాయని తెలిపింది.

 

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ఆరు జాతీయ పార్టీలో కేవలం బీజేపీ, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) మాత్రమే ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలిపాయని, ఈ మూడు పార్టీలు సమీకరించిన మొత్తం విరాళాలు రూ.1,931.43 కోట్లని బుధవారం విడుదలచేసిన నివేదికలో ఏడీఆర్ వెల్ల‌డించింది. ‘ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బీజేపీ రూ.1,450.89 కోట్లు, కాంగ్రెస్‌ రూ.383.26 కోట్లు, టీఎంసీ రూ.97.28 కోట్ల విరాళాలను సమీకరించాయి’ అని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.192.65 కోట్ల ఆదాయం వచ్చినట్టు టీఎంసీ, రూ.100.96 కోట్ల ఆదాయం వచ్చినట్టు సీపీఎం, రూ.69.79 కోట్ల ఆదాయం వచ్చినట్టు బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక పేర్కొంది.

 

 2017-18లో రూ.1,027.34 కోట్లుగా ఉన్న బీజేపీ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,410.08 కోట్లకు, కాంగ్రెస్‌ పార్టీ ఆదాయం రూ.199.15 కోట్ల నుంచి రూ.918.03 కోట్లకు పెరిగిందని, ఇందులో ఎన్నికల ప్రచారానికి లేదా సాధారణ ప్రచారానికి బీజేపీ రూ.792.39 కోట్లు, కాంగ్రెస్‌ పార్టీ రూ.308.96 కోట్లు ఖర్చు చేశాయని ఏడీఆర్‌ వివరించింది. మొత్తంగా ఇటు ఆదాయం అటు ఖ‌ర్చుల్లో బీజేపీ టాప్‌లో నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: