సంక్రాంతి పండుగ సమయంలో తెలుగురాష్ట్రాల్లో బస్సులు, రైళ్ళు కిటకిటలాడుతున్నాయి. సొంత ఊర్లకు ప్రయాణించే వారు.. తిరిగి ప్ర‌యాణం చేసి వారితో బస్ స్టాండ్ లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. ఇక ఇదే సమయంలో విపరీతంగా ధరలు పెంచి ప్రైవేట్ బస్సులు దందాకు తెరతీస్తాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో టిక్కెట్టు చార్జీలు అధికంగా పెంచేవారు. ఇప్పుడలా కాదు.. పండగ, పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి వీటి రేట్లు పెంచేస్తున్నారు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లాలనే ప్రయాణికుల నుంచి అయిన కాడికి దోచుకోవడానికి బుకింగ్స్ ఓపెన్ చేశాయి ప్రైవేట్ ట్రావెల్స్. 

 

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అక్కడా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనినే అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టిక్కెట్ల రేట్లు పెంచుకుంటూపోతూ క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ అధికారులు ఈ వ్యవహారాలపై దృష్టి సారించారు. బాగా టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై కొరడా ఝుళిపిస్తున్నారు. అయినా కూడా ప్రైవేట్ బ‌స్సుల ఆగ‌డాలు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇదిలా ఉంటే..  తాజాగా ఏపీలో ప్రైవేట్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు రవాణశాఖ మంత్రి పేర్ని నాని గట్టి వార్నింగ్ ఇచ్చారు.  

 

నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 516 బస్సులు సీజ్‌ చేశామని.. సంక్రాంతికి 3 వేలకు పైగా స్పెషల్‌ బస్సులు నడిపామని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ప్రైవేట్‌ బస్సుల్లో అధికచార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని, పండగ పేరుతో దోపిడీ చేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై కేసులు నమోదు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నేటి నుంచి ఈ నేత 20వ తేది వ‌ర‌కు మళ్లీ తనిఖీలు నిర్వహిస్తామని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. అలాగే బ‌స్సు టిక్కెట్లు పెంచితే స‌హించేది లేద‌ని ఆయన వెల్ల‌డించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: