ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృథ్వీ ఆడియో టేపుల వ్యవహారం ఏపీలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఛానెల్ ఉద్యోగినితో పృథ్వీ అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో రికార్డు వైరల్ కావడం, పార్టీల నుండి, ప్రజల నుండి విమర్శలు రావడంతో వైసీపీ ప్రభుత్వం సూచనల మేరకు పృథ్వీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తరువాత పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ తన తప్పు తేలితే మాత్రమే తిరిగి విధుల్లో చేరతానని వ్యాఖ్యలు చేశారు. 
 
ఆడియో టేపుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే టీటీడీ ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విచారణలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరి ప్రమేయం వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. పృథ్వీతో మాట్లాడిన ఎస్వీబీసీ మహిళా ఉద్యోగి ఎవరనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఆడియోలో మాట్లాడిన మహిళ పృథ్వీపై ఫిర్యాదు చేయకపోవటంతో మహిళ ఎవరో తెలియటం లేదు. 
 
విజిలెన్స్ పృథ్వీ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్టు తెలుస్తోంది. ఛానెల్ లో ఉద్యోగుల వివరాలతో పాటు పృథ్వీ ఛైర్మన్ అయిన తరువాత ఉద్యోగాలను పొందిన వారి వివరాలను కూడా విజిలెన్స్ సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. పృథ్వీ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదని చెప్పటంతో ఫోరెన్సిక్ నివేదిక కీలకంగా మారింది. మరోవైపు ఛైర్మన్ గా పృథ్వీ ఉన్న సమయంలో ఇద్దరు మహిళా స్టైలిస్టులను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 
 
విజిలెన్స్ ఈ ఇద్దరు మహిళల్లో ఒకరి పాత్ర గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. పృథ్వీ ఆ ఇద్దరు మహిళలను కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల్లో నియమించారని ఆ తరువాత అక్రమంగా ఉద్యోగ నియామకాలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఆ ఇద్దరు మహిళలను తొలగించినట్టు తెలుస్తోంది. విజిలెన్స్ బోర్డుకు అందించే నివేదిక కీలకం కానుంది. నివేదిక వచ్చిన తరువాత పృథ్వీ చెప్పిన అంశాల్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా పృథ్వీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: