నడిపేవాడు ఎవ్వడు నడిపించే వాడు ఎవ్వడు ! అంతా ఆ దేవుని లీల కాకపోతే ?  అనుకుంటూ రావిచెట్టు దగ్గర ఉన్న రచ్చ బండ దగ్గర కూర్చున్నాను. కూర్చున్నవాడిని  కుదురుగా ఉంటానా ? ఏదో ఒక విషయం పై ఎవరో ఒకరిని కెలకకపోతే మనకి ఊసుపోదు  కదా ! అందుకే పక్కనే కూర్చున్న కుర్ర గాళ్లను పలకరించా ! ఏరా అబ్బాయిలు ఏంటి సంగతులు అంటూ...! ఆ ఏముంది బాబాయ్ మా హీరో పెట్టిన పార్టీతో మరో పెద్ద పార్టీ పెట్టుకుంది అంటూ వెలిగిపోతున్న మొఖంతో చెబుతుంటే అవునా.... అంటూ సాగదీసాను. ఇంతకీ మీ హీరో ఆల్లతో అయినా కుదురుగా ఉంటాడా లేక ఆళ్ళ పెంచెలు, గోసీలు ఊడదీత్తనని ఎగుర్తుడా ? అన్నాను. 


అదేంటి బాబాయ్ మా హీరో కమ్ నాయకుడు ఎంత గొప్పోడో తెలుసా ? సినిమాలు మానేసి మరీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. మా హీరో పార్టీ సిద్ధాంతాలు ఇంకా ఏ పార్టీకి ఉండవు తెలుసాడు. హా ఎందుకు తెల్వదు దేన్నైనా మధ్యలోనే వదిలిపెట్టడం అలవాటే కదా అంటూ డైలాగు వేసే సరికి నా వంక కోపంగా చూసారు. ఓరి నయానో అనుకుంటూ పొగడడం మొదలెట్టా అవున్రా అబ్బాయ్ మీ వాడు చాలా గొప్పవాడే కాదు చానా ధైర్యవంతుడు అందుకే ఆ పెద్ద పార్టీ నేతలను పాసిపోయిన లడ్డు, వాడిపోయిన పువ్వు మన రాష్ట్రానికి అన్యాయం చేస్తదా అంటూ తిట్టిపోసి ఇప్పుడు అల్లా పక్కనే నీలాడబడాలంటే ఎంత ధైర్యం ఉండల్రా ? 


అసలు ఇప్పుడు ఆ పెద్ద పార్టీ పక్కకు చేరకపోతే మీరంతా ఏమైపోతార్రా ? మీ కోసమే కదరా వాళ్ళతో కలిసింది. ఇప్పడు వరకు ఆ పార్టీ బండిని తొలి అలిసిపోయాడు కాబట్టే కదరా ఇప్పుడు వెనక డిక్కీలో కూర్చుందామని డిసైడ్ అయిపోయాడు. అసలు చేగువేరా నేనే అన్నట్టుగా ఊగిపోయి కమలం పువ్వు వాడినట్టుగా వాడిపోయాడేంట్రా ? బొలివియా యుద్ధం నుంచి భగత్ సింగ్ వరకు అన్నీ తనకు తెలుసన్నట్టుగా చెప్పి ఇప్పుదేంట్రా ఇలా చేసాడు అనగానే వారికి చిర్రెత్తుకొచ్చినట్టుంది.


 వెంటనే కోపంగా లేచి ఏయ్ ఏయ్ ... మా జూనియర్ చెగువేరాని అంత మాట అంటావా ? అంటూ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. హమ్మయ్య ఈ రోజుకి మన కాలక్షేపం అయిపోయిందనుకుంటూ మెల్లిగా ఇంటి ముఖం పట్టాను.

మరింత సమాచారం తెలుసుకోండి: