సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లను పెంచి అమ్ముతున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లను రెండు రెట్లు, మూడు రెట్లు పెంచి అమ్ముతున్నారని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో ప్రయాణికుల నుండి ప్రైవేట్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తూ ఉండటంపై, ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలపై పేర్ని నాని స్పందించారు.                             
 
మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ నిబంధనలు పాటించని బస్సులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు పాటించని 546 ప్రైవేట్ బస్సులను ఇప్పటికే సీజ్ చేశామని పేర్ని నాని తెలిపారు. 3,000కు పైగా స్పెషల్ బస్సులు సంక్రాంతి పండుగకు నడిపినట్లు పేర్ని నాని తెలిపారు. వాట్సాప్ ద్వారా ప్రైవేట్ బస్సుల్లో అధిక ధరలు వసూలు చేస్తే 8309887955 నంబర్ కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. 
 
పండగ పేరు చెప్పుకుని అధిక ఛార్జీలు వసూలు చేస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. 3,172 కేసులు అధిక ధరలు మరియు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేట్ బస్సులపై నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చాలా ఫిర్యాదులు వచ్చినట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రైవేట్ బస్సులపై అధికారుల తనిఖీలు జరుగుతాయని చెప్పారు. 
 
ఈరోజు నుండి మరలా తనిఖీలు నిర్వహిస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు. కొన్ని రూట్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నట్టు ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సుల ద్వారా 3,19,000 మందిని గమ్యస్థానాలకు చేర్చినట్టు పేర్ని నాని తెలిపారు. మంత్రి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించటం ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: