పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం శాసనసభలో శుక్రవారం తీర్మానాన్ని ఆమోదించింది. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇక‌ తాజాగా పంజాబ్ అసెంబ్లీ  కూడా సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం ఆమోదించింది. దీంతో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మాణం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్‌ నిలిచింది. పంజాబ్‌ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి బ్రహ్మ మహింద్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.

 

`కేంద్రం ప్రవేశపెట్టిన సీఏఏ, దేశ వ్యాప్తంగా అశాంతికి, నిరసనలకు కారణమైంది. స్వేచ్ఛా, సమానత్వంతో ఉన్న ప్రజాస్వామ్యానికి ఈ బిల్లు వ్యతిరేకం. మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పించడంతో దేశంలోని కొన్ని వర్గాల భాష, సంస్కృతి ప్రమాదంలో పడే అవకాశం ఉంది`. అని పంజాబ్ ప్రభుత్వం ఆ తీర్మానంలో పేర్కొంది. అయితే పంజాబ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంకు ఆమ్‌ఆద్మీ పార్టీ, లోక్‌ ఇన్సాఫ్ పార్టీలు మద్దతు తెలిపాయి. మరోవైపు ప్రతిపక్షమైన బీజేపీ తీర్మానంను వ్యతిరేకించింది. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదల్ కూడా తీర్మానంను వ్యతిరేకిస్తూనే చట్టంలో మార్పులు చేయాలని చెప్పింది. సీఏఏ పరిధిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా చేర్చాలని శిరోమణి అకాలీదల్ సూచనలు చేసింది.

 

అలాగే ‘పంజాబ్‌తో సహా దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మాణం చేస్తున్నాం’ అని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యులు ఓకే చెప్పడంతో తీర్మానం నెగ్గింది. కాగా, గత నెలలో కేరళ ప్రభుత్వం కూడా పౌరసత్వం సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానానికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. శాసనసభలో ఈ తీర్మానాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రవేశపెట్టగా ఆ రాష్ట్ర శాసన సభ్యులంతా ఆమోద ముద్ర వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: