బీజేపీ-జనసేన కలయిక రాష్ట్రానికి ఎంతవరకు మేలు చేస్తుందన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని,  కేంద్రంలో ప్రభావితం చేయగలస్థానంలో ఉన్న బీజేపీ రాజధాని మార్పు అంశంలో పెద్దన్నపాత్ర పోషించాలని అమరావతి ఉద్యమకారులతో పాటు,  ఆంధ్రులంతా విశ్వసిస్తున్నారని టీడీపీ సీనియర్‌నేత, ఆపార్టీఎమ్మెల్యే, పీఏసీఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ తెలిపారు. అమరావతి ఉద్యమం ఆరంభమయ్యాక బీజేపీ పెద్దలు రోజుకోవిధంగా మాట్లాడారని, రాజధాని మార్పు అంశం తమపరిధిలోకి రాదని ఒకరంటే, ప్రభుత్వచర్యలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయి కాబట్టి, కేంద్రం కలుగచేసుకుంటుందని మరొకరు మాట్లాడారన్నారు. 

 

ఈ నేపథ్యంలో బీజేపీ-జనసేన కలయిక కేవలం భేటీలకే పరిమితం కాకుండా, ఇప్పటికైనా ప్రత్యక్షకార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లాలన్న ఆకాంక్ష రాష్ట్రమంతటా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, తమచర్యలను సమర్థించుకునే క్రమంలో కేంద్రం అనుమతి తోనే చేస్తున్నామని పలుసందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయాన్ని పయ్యావుల ఉటంకించా రు. కేంద్రంలోని పెద్దల ఆశీస్సులతోనే అమరావతి మార్పు నిర్ణయాన్ని అమలుచేస్తున్నామని, ఇది ఎట్టిపరిస్థితుల్లో ఆగదని కూడా వారు చెప్పడం జరిగిందన్నారు. 

 

ఇవన్నీ చూశాక, బీజేపీ తాజాగా చేసిన రాజకీయతీర్మానం ఆసక్తి రేపుతోందన్నారు. భవిష్యత్‌లో   బీజేపీ ఏరకంగా ముందుకెళుతుంది.. ప్రజలపక్షాన నిలిచి అమరావతి మార్పు నిర్ణయాన్ని నిలుపుదల చేస్తుందా.. లేక వైసీపీకి అండగా నిలుస్తుందా అనేదాన్నిబట్టే రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్‌ తేలుతుందన్నారు. రాష్ట్ర విభజనసమయంలో, ప్రత్యేకహోదా, స్పెషల్‌స్టేటస్‌ల విషయంలో బీజేపీ వైఖరిని గమనించిన ప్రజలు, అమరావతి మార్పు అంశంలో, రాజకీయవైరుధ్యాలకు అతీతంగా అన్నిపార్టీలను గమనిస్తున్నారని, ఆదేవిధంగా కాషాయపార్టీ నిర్ణయమెలా ఉంటుందన్న  ఆలోచనలో ఉన్నారని, బీజేపీ ఏంచేస్తుందనేది వారం, పదిరోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.

 

70 ఏళ్లుగా ఉన్న రామజన్మభూమి సమస్యను, తరాలపాటు ఉన్న కశ్మీర్‌ అంశాన్ని, చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించామని, పాకిస్తాన్‌ను నొప్పించి, అమెరికాను మెప్పించామని చెప్పుకుంటున్న వారు, వారికి అతిచిన్న అంశమైన అమరావతి సమస్య ను పరిష్కరించలేరా అన్న అభిప్రాయం రాష్ట్రవాసుల్లో ఉందని కేశవ్‌ అభిప్రాయపడ్డారు.  వైసీపీనేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే, కేంద్రపెద్దల ఆశీస్సులు రాష్ట్రానికి ఉన్నాయనే అనుమానం కలుగుతోందన్నారు. హైకోర్టు తరలింపనేది కేంద్రానికి సంబంధించిన అంశమని, ఆ విషయంలోకూడా రాష్ట్రముఖ్యమంత్రే స్పష్టమైన ప్రకటన ఇవ్వడం చూస్తుంటే, కేంద్రం ఆనిర్ణయాన్ని అమోదించిందా అనే అనుమానం రాష్ట్రప్రజలందరిలో ఉందన్నారు. జనసేన-బీజేపీ కలయిక వల్ల రాష్ట్రానికి, మరీముఖ్యంగా అమరావతికి మేలు కలగాలన్న దిశగా, బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలన్నారు.   నెలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఇరుపార్టీల ప్రభావం ఏమిటనేది తేలుతుందని , ప్రజలంతా పోరాడేవారిపక్షానే ఉంటారని, చంద్రబాబునాయుడు వారి ముందుండి నడిపిస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేశవ్‌ అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణన్‌కమిటీ భూములధరలపై మాత్రమే అభ్యంతరం తెలిపిందని, ఆసమస్యను చంద్రబాబు ల్యాండ్‌పూలింగ్‌ నిర్ణయంతో అధిగమించారన్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: