భారతీయులమైన మనం:  సి ఎ ఎ, ఎన్ఆర్ సి లకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ఇప్పుడు భారతదేశం అనే ఆలోచనను రక్షించుకునే ఉద్యమంగా మారింది”యోగేంద్ర యాదవ్, రాధిక వేముల సామాజిక న్యాయాన్ని  సి.ఎ.ఎ-ఎన్.ఆర్.సి- ఎన్.పి.ఆర్. లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ  అగ్రభాగానికి  తీసుకొచ్చారు; రోహిత్ వేముల సంస్మరణ వార్షికోత్సవాన్ని నేడు దేశవ్యాప్తంగా “సామాజిక న్యాయ దినోత్సవంగా” పాటిస్తున్నారు. రోహిత్ వేముల నాల్గవ సంస్మరణ దినోత్సవం నాడు  యోగేంద్ర యాదవ్, రోహిత్ తల్లి రాధిక వేముల భారత రాజ్యాంగాన్ని, సామాజిక న్యాయాన్ని సంరక్షించుకోవటానికి, సి ఎ ఎ-ఎన్ఆర్ సి- ఎన్ పి ఆర్  లకు వ్యతిరేకంగా అన్నిమతాలు, సమూహాల ప్రజలు బయటికి రావాలని హైదరాబాదు పౌరులకు పిలుపునిచ్చారు. ఈ  కార్యక్రమాన్ని ‘వి ద పీపుల్ – భారతీయులమైన మనం” అనే బ్యానర్ పై, “ఎన్.ఆర్.సి.-సి.ఎ.ఎ. వ్యతిరేక పౌర వేదిక” అనే పౌర సమాజ, యువ  ఉద్యమకారుల వేదిక నిర్వహించాయి.  ఈ రోజు జనవరి 17వ తేదీని “వి ద పీపుల్” ఆధ్వర్యంలో  దేశ వ్యాప్తంగా “సామాజిక న్యాయ దినోత్సవంగా” పాటిస్తున్నారు. 

బంజారా హిల్స్ లోని  లామకాన్ లో నిర్వహించిన  ఈ కార్యక్రమంలో  ముందుగా ఇఫ్లు ప్రొఫెసర్, ముస్లిం మహిళల ఫోరం సంభ్యులు  అస్మా రషీద్, దళిత బహుజన ఫ్రన్ట్ కార్యదర్శి  పి.శంకర్ మాట్లాడుతూ  సి ఎ ఎ-ఎన్ఆర్ సి- ఎన్ పి ఆర్ ప్రక్రియ న్యాయం, సమానత్వాల మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు.  పౌరసత్వ సవరణ చట్టం  స్పష్టంగా రాజ్యాంగ విరుద్దమని అస్మా రషీద్ అన్నారు. “నాకు బర్త్ సర్టిఫికెట్ లేదు, నేను పుట్టిన తేదీని నా తల్లితండ్రులు రాయలేదు, స్కూల్ టీచర్ రాశారు, అంటే నేను భారత పౌరిడిని కాకుండా పోతానా? ఇది ముస్లింల  సమస్య ఒక్కటే కాదు, ఇది దళితులు, ఆదివాసులు, అణగారిన సమూహాలవారందరిదీ” అని శంకర్ అన్నారు. 

“నా కొడుకును ఎట్లా కాపాడుకోవాలో  తెలియక రోహిత్ ను పోగొట్టుకున్నాను. ఇప్పుడు మన దేశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నాము. మన దేశాన్ని  రక్షించుకోవటానికి ఇప్పుడు అందరం కలసి పోరాటం చేద్దాం. అన్యాయం, అణచివేతల కారణంగా పిల్లలను కోల్పోయిన తల్లులుగా   సి ఏ ఏ-ఎన్ఆర్ సి- ఎన్ పి ఆర్  లను  వ్యతిరేకిస్తున్నాం. పౌరులు ఒక ఓటుగా, ఒక సంఖ్యగా దిగజార్చబడతారు అని రోహిత్ నాలుగేళ్ళ క్రింద  అన్నాడు. ఇప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది -  ప్రజలు ఓటు, సంఖ్యా కూడా పొందకుండా చేయటానికి వాళ్ళు  ప్రయతినిస్తున్నారు” అని రాధిక వేముల అన్నారు. ముంబాయ్ లో వివక్ష కారణంగా ఆత్మహత్యకు నెట్టివేయబడిన పాయల్ తాడ్వి తల్లి, కనపడకుండా పోయిన జె ఎం యు విద్యార్థి నజీబ్  తల్లి, తాను కలసి “ జాతి తల్లుల” బ్యానర్ కింద అంబెడ్కర్ రూపొందించిన  రాజ్యాంగ సూత్రాల పరిరక్షణ కోసం ఒక యాత్ర  చేపట్టబోతున్నట్లు రాధిక ప్రకటించారు.                      

యోగేంద్ర యాదవ్ గారు రాధిక వేములగారిది పెద్ద త్యాగం, ఈరోజు రోహిత్ వేముల వర్ధంతిని దేశమంతటా “వీ ద పీపుల్” బ్యానర్ పై “సామాజిక న్యాయ దినం”గా పాటిస్తూ సి.ఏ.ఏ.-ఎన్.ఆర్.సి. పై దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు, ఈ రోజు ఇంకా ఎంతో మంది తల్లులు ఇదే విధంగా అన్యాయంగా తమ బిడ్డలను కోల్పోతున్నట్లు పేర్కొన్నారు. “సి.ఏ.ఏ.-ఎన్.ఆర్.సి. వ్యతిరేక ఉద్యమం మొదలైన తర్వాత ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పూర్తిగా చట్ట వ్యతిరేక అణచివేత చర్యలు చేపట్టింది. ఇప్పటి దాక పోలీసు కాల్పులలో 22మంది మరణించారు. వారిలో 19 కేసులలో పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా ఆయ కుటుంబాలకు అందలేదు. కొన్ని కేసులలో తల్లికి తన బిడ్డ మృత దేహం కూడా చూపకుండానే పోలీసులు అంత్యక్రియలు చేయడం జరిగింది.” 

“ఈరోజు రాధిక వేముల గారు, పాయల్ తడ్వి తల్లి వంటి వారు యాత్ర చేస్తే తప్పక మేమంతా సహకరిస్తాం. దేశం ముందు మనం వాస్తవాలను తీసుకు వెళ్ళటానికి ఇది ఉపయోగిస్తుంది అని అన్నారు. జామియా మిలియా లోను, జే.ఏ.యూ.లోను, అలీగడ్ యూనివర్సిటీ లోను పోలీసుల తీరు దేశమంతా చూసింది. అయితే దీనితో ఉద్యమం మరింత బల పడింది, దేశమంతటా విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు.  అదే విధంగా ఢిల్లీలోని ‘షహీన్ బాగ్’ లో జరుగుతున్న నిరసనలో సాధారణ మహిళలు పెద్ద ఎత్తున తమ చిన్న పిల్లలతో సహా పాల్గొనడంతో దేశ ప్రజల హృదయాలను అది కదిలించింది. వీరి పోరాటంలో న్యాయం ఉందని దేశమంతా గుర్తించింది. మిలియన్ మార్చ్ ఎంత ముఖ్యమో, ఇటువంటి నిరసనలు కూడా అంటే ముఖ్యం” అని ఆయన అన్నారు.

“ఇప్పుడు ఇది కేవలం సి.ఏ.ఏ.-ఎన్.ఆర్.సి. లకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమం కాదు. ఇది ఒక ఉద్యమం అయింది. ఇది మన స్వాతంత్రోద్యమంలో సాధించుకున్న భారతదేశాన్ని కాపాడటానికి ఉద్యమం. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, దళితులూ, ఆదివాసీలు – అందరూ సమాన పౌరాలన్న సూత్రాన్ని కాపాడుకోవటానికి, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఇది ఉద్యమం. ఈ ఉద్యమంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. పెద్ద రాలీలు, సభలే కాక, ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో ఈ విషయం గురించి అవగాహన పెంచాలి. అటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాలి.”

ఎన్.పి.ఆర్. అంటే “జాతీయ పౌరుల రిజిస్టర్” పేరుతో ఇప్పుడు మొదలైన ప్రక్రియని మనం మొదటి రోజు నుండే వ్యతిరేకించాలని యోగేంద్ర యాదవ్ అన్నారు. మనం ఎవరం కూడా పౌరుల రిజిస్టర్ కోసం ఎటువంటి సమాచారం నమోదు చెయ్యకూడదు. ఇది మనం సత్యాగ్రహంలా చేద్దాం. ఇప్పుడు ఆపితేనే ఎన్.ఆర్.సి. (జాతీయ పౌరసత్వ జాబితా)ను మనం ఆపగలుగుతాం.

“ఎన్.ఆర్.సి.-సి.ఏ.ఏ. వ్యతిరేక వేదిక” తరఫున పౌరులందరూ ఈ ఉద్యమంలో పాల్గోనవలెనని జాహిడ్ కాద్రీ మరియు మీరా సంఘమిత్ర పిలుపునిచ్చారు. జనవరి 26వ తేదీ, రిపబ్లిక్ డే రోజున నగరమంతటా రాజ్యాంగానికి సంబంధించిన “వీధి నాటకాలు” 100 స్థానాలలో యువ కార్యకర్తల బృందం చేయనున్నట్లు విస్సా కిరణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రయత్నంలో ప్రతి సంస్థ, సంఘం పాల్గోనవలెనని పిలుపునిచ్చారు.    

.    

మరింత సమాచారం తెలుసుకోండి: