వైసీపీ ప్రభుత్వం వచ్చిన 7నెలల్లోనే లైంగికవేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఈవ్‌టీజింగ్‌ వంటి ఘటనలు కోకొల్లలుగా సాగాయని, దిశచట్టాన్ని పకడ్బందీగా అమలుచేస్తామని, 21రోజుల్లోనే నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం ఆదిశగా ఎలాంటి చర్యలు తీసుకుందో, ఎంతమంది కామాంధుల్ని శిక్షించిం దో చెప్పాలని టీడీపీ మహిళానేత, పార్టీ అధికారప్రతినిధి దివ్యవాణి డిమాండ్‌చేశారు.  దిశచట్టం గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటనచేసిన రోజునే గుంటూరులో లక్ష్మణరెడ్డి అనేవ్యక్తి, పశువుకన్నా హీనంగా అత్యాచారానికి పాల్పడితే అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 


అలానే ప్రకాశం జిల్లా చినగంజాంలో వైసీపీకార్యకర్తల దుశ్సాసన, మానభంగపర్వానికి బలైన పద్మఅనే వివాహిత ఉరేసుకొని చనిపోయిందని,   నెల్లూరు జిల్లాలోని కనిగిరిలో గ్రామవాలంటీర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడని, జరిగిన ఘటనపై ఫిర్యాదు అందినా ఇప్పటివరకు ఏవిధమైన చర్యలు లేకపోవడం ఈప్రభుత్వ పనితీరుకి సంకేతమన్నారు. సామాన్య మహిళలతోపాటు, బాధ్యతాయుతమైన వృత్తులు, పదవుల్లో ఉన్నవారుకూడా వైసీపీనేతల ఆకృత్యాలకు బలవుతున్నారని దివ్యవాణి ఆవేదన వ్యక్తంచేశారు. 

 

నెల్లూరుజిల్లాలో మహిళా ఎంపీడీవోగా పనిచేసిన సరళను, వైసీపీఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దుర్భాషలాడి బెదిరించాడని, అదేజిల్లాలో గూడూరులో  దుగ్గబోయిన సాయికుమార్‌, మద్దూరు శరత్‌, చల్లా లక్ష్మయ్య, సుబ్రమల్లి వినోద్‌కుమార్‌  లనే వైసీపీ కార్యకర్తలు మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారాలకు పాల్పడ్డారని, వారందరినీ జగన్‌ ఎందుకు శిక్షించలేకపోయాడని ఆమె నిలదీశారు. వైసీపీ నుంచి పోటీచేసిన వారిలో నూటికి 70మందికి నేరచరిత్ర ఉన్నవారికే జగన్‌ ఎమ్మెల్యే టిక్కెట్లిచ్చాడని, గెలిచాక మంత్రిపదవులిచ్చి సత్కరించడం జరిగిందన్నారు. అటువంటివారిని పక్కన పెట్టుకున్న ముఖ్యమంత్రి, మహిళలకు ఎలా న్యాయం చేస్తాడన్న సందేహం ప్రతి ఒక్కమహిళలోనూ ఉందన్నారు. 

 

ముఖ్యమంత్రి ఆదేశాలతోనే ఖాకీలు రాజధాని పోరాటం చేస్తున్న మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారని దివ్యవాణి ఆరోపించారు. పోలీస్‌  క్రూరత్వానికి బలవుతున్న అమరావతి ప్రాంత 'దిశ'లకు జగన్‌ ఏం సమాధానం చెబుతాడన్నారు. అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, అంటూ పాదయాత్రలో బంధుత్వాలు కలిపిన ముఖ్యమంత్రి, అధికారం చేతికందగానే బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగులేసుకుంటూ హెలికాఫ్టర్లలో చక్కర్లు కొడుతున్నాడని దివ్యవాణి మండిపడ్డారు. రాజధాని ఆందోళనలో పాల్గొంటున్న మహిళలపట్ల వైసీపీకార్యకర్తలే క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, కళ్లలోకారం కొడుతూ, రాళ్లతో గాయపరుస్తున్నారని ఆమె తెలిపారు. నాకు చెల్లెలుంది, నాకు ఆడపిల్లలు ఉన్నారని, ఒక అన్నగా, ఒకతండ్రిగా నేనెలా స్పందిస్తానో.. అలానే బాధిత మహిళల తరుపువారుకూడా స్పందిస్తారని, మహిళలను చెరబట్టినవారిని 21రోజుల్లోనే శిక్షిస్తానని అసెంబ్లీసాక్షిగా బొంకిన జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్రంలోని మహిళల్ని, వారిపై జరగుతున్న ఆకృత్యాలను మర్చిపోయి, వీడియోగేమ్‌లు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడని దివ్యవాణి దుయ్యబట్టారు. 

 

గన్నుకన్నా ముందు జగనన్న ఉంటాడని చెబుతున్న వైసీపీ మహిళామంత్రులు, తమపార్టీవారిని ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారన్నారు. కర్నూలులో ఎస్సై శరత్‌కుమార్‌రెడ్డి దూషణలు, దురుసుతనం కారణంగా మనస్తాపం చెందిన ఒకస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిందని, సదరు ఎస్సైపై ఏం చర్యలు తీసుకున్నారని  ఆమె ప్రశ్నించారు. గూడూరులో బాలికపై అత్యాచారానికి పాల్పడిన కత్తిరమణయ్యను  ఏం చేస్తారన్నారు. మాటతప్పను... మడమ తిప్పననే నినాదం ప్రచారానికే పరిమితమైం దని, అధికారంలోకి వచ్చాక కక్షపూరితపాలనకే జగన్‌ పరిమితమయ్యాడన్నారు. రాష్ట్రంలో వైసీపీ వచ్చాక జరిగిన అత్యాచారాలు, వేధింపులజాబితాను తీసుకొని జగన్‌ వద్దకు వెళ్లడానికి తాము సిద్ధమని, ఎలాంటి చర్యలు తీసుకుంటాడో, తరతమబేధాలు లేకుండా తమవాళ్లను ఆయనెలా శిక్షిస్తాడో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. 

 

పవిత్రమైన స్థానంలో పృథ్వీరాజ్‌ను నియమిస్తే, ఆయన నీచత్వాన్ని చూపించాడని, అలాంటివ్యక్తిని  కేవలం పదవినుంచి తప్పించి చేతులుదులుపుకోవడం జగన్‌కే చెల్లిందన్నారు. టిక్‌టాక్‌లు చెయ్యడం, అద్దాలముందు మేకప్‌లువేసుకొని విలేకర్లముందుకు వచ్చి అసత్యాలు వల్లించే మహిళానేతలంతా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని టీడీపీ నేత హితవుపలికారు. మహిళల ఉసురు తగలకముందే జగన్‌ప్రభుత్వం, అధికారమత్తు లోంచి బయటకు రావాలని, అన్యాయాలకు బలవుతున్న మహిళలను ఆదుకోవాలని దివ్యవాణి సూచించారు. జగన్‌ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అత్యాచారాలకు పాల్పడిన తనరెడ్డిసోదరులను శిక్షించడంద్వారా ఆయనేమిటో, ఆయన నీతి,నిజాయితీలేమిటో ప్రజలకు తెలుస్తాయని ఆమె తేల్చిచెప్పారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: