టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని పెద్దల మద్దతుతోనే ఏపీ రాజధానిని మార్చుతున్నట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటివరకూ ఎవరూ ప్రస్తావవించని అంశాన్న తెర పైకి తెచ్చినట్టైంది. ఇప్పటికే బీజేపీకి టీడీపీపై ఉన్న వైరానికి ఆయన ఆజ్యం పోసినట్టైందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

 

పయ్యావుల మాట్లాడుతూ.. ‘హైకోర్టు మార్పు కేంద్రానికి సంబంధించిన విషయం. హైకోర్టు మార్పు ప్రకటనను కేంద్రం ఎందుకు ఖండించలేదో చెప్పాలి. అమరావతి విషయంలోనూ కేంద్రం వైఖరి అలాగే ఉంది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాలి కానీ మౌనం వహించటం సరికాదు. రాజధాని తరలించాలన్న వైసీపీ నిర్ణయం ఏవిధంగా ప్రభావం చూపుతుందో స్థానిక ఎన్నికల్లో తేలుతుంది. బీజేపీ నిర్ణయాలే ఆ పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ప్రజల తరపున పోరాటంలో చంద్రబాబే ముందున్నారు. ప్రజలు చంద్రబాబు పక్షాన ఉన్నారు. బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరి ఏంటో తెలిసింది. అమరావతి విషయంలో కేంద్రం వైఖరిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీ రాజధానిపై పార్లమెంటులో చర్చించే అధికారం కేంద్రానికి ఉంది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

 

పయ్యావుల వ్యాఖ్యలు బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి. రాజధాని అంశం కేంద్రానికి చాలా చిన్న విషయమని అంటూనే బీజేపీని తప్పుబట్టారు. బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి ఏంటో ప్రజలు గమనించారని ఒకింత వ్యంగ్యంగా అన్నారు. నిజానికి కేంద్రం ఏపీ రాజధాని అంశంపై.. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగత అంశమని మాత్రమే అన్నారు. జనసేన-బీజేపీ పొత్తు గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రానికి మేలు జరిగేలా వారి పొత్తు ఉండాలని అన్నారు. పయ్యావుల సంచలన వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: