తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పై తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తాయి. తంతై పెరియార్‌పై రజనీకాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ద్రవిడార్ సంఘం ఆరోపించింది. ఈమేరకు ద్రావిడార్ విదుతలై ఖజగం పోలీసులకు రజినీపై ఫిర్యాదు చేశారు. పెరియార్ అంటే తమిళనాట ఎంతో గౌరవం ఉంటుంది. ఆయనపై వ్యాఖ్యలు చేసారని డిఎంకే ఆధ్వర్యంలో నిరసనలు కూడా జరిగాయి.

 

 

రజనీకాంత్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోయంబత్తూరుకు చెందిన ద్రవిడార్ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. పెరియార్‌ ఈవీ రామస్వామిపై రజినీ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని 153 (ఏ) సెక్షన్‌ ప్రకారం రజినీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ద్రవిడార్‌ సంఘం డిమాండ్‌ చేసింది. 1971లో పెరియార్‌ నిర్వహించిన మహానాడులో శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి అవమానం జరిగిందని, ఈ ఘటన వల్ల పెరియర్‌ సిద్ధాంతాలను అనుసరించే డీఎంకే అప్పటి నుంచీ రాజకీయంగా వెనుకబడి పోయిందని రజినీ ఇటివల వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. అటుగా 'ఊరేగింపు సాగుతుండగా సీతారాముల చిత్రపటాలపై డీఎంకే కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీనివల్ల డీఎంకే బాగా దెబ్బతింది. అప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి ఎంతో చెడ్డపేరు కూడా వచ్చింది' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు డీఎంకే పార్టీ నేతల ఆగ్రహానికి గురిచేశాయి.

 

 

ఈ వ్యాఖ్యలను డీఎంకే పార్టీ తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా.. 'తుగ్లక్‌' పత్రిక తరఫున ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కూడా రజనీకాంత్‌ తన ప్రసంగంలో పలు వ్యాఖ్యలు చేశారు. 'మురసొలి పత్రిక చేతిలో ఉంటే అతడు డీఎంకే పార్టీకి చెందిన వాడిగా పరిగణిస్తామనిజజ అదే తుగ్లక్‌ పత్రిక చేతిలో ఉంటే మేధావిగా పరిగణిస్తామని అన్నారు. సినిమాలపరంగా సూపర్ స్టార్ అయినా రాజకీయంగా మాత్రం రజినీ అనేక విమర్శలకు గురవుతున్నారు. ఇంకా పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాకున్నా ఆయన రాజకీయ ప్రవేశాన్ని మాత్రం తమిళుల్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: