ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మీడియా మేనేజ్ మెంటులో దిట్ట అన్న సంగతి కొత్త విషయం కాదు. దీనికి తోడు.. ఆయనకు బాకా ఊదేందుకు.. ఆయన ఏం చేసినా ఆహో.. ఓహో అంటూ దాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు అనుకూల మీడియా ఉండనే ఉంది. అందుకే ఆయన ఆ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తుంటారు. అలా ఆయన ప్రజలను భ్రమల్లో పెట్టాలని చేసిన మరో ప్రయత్నమే అమరావతీ మహానగరం అని చెప్పొచ్చు.

 

ఒక రాజధాని నిర్మించే అవకాశం చరిత్రలో చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ మహదవకాశం చంద్రబాబు దక్కింది. విడిపోయిన రాష్ట్రానికి రాజధాని నిర్మించే ఛాన్సు వచ్చింది. కానీ.. దాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. త్రివిక్రమ్ సినిమాలో.. ఎమ్మెస్ నారాయణను ఏం చేస్తుంటావని అడిగితే.. ఏమీ చేయను.. తొందరపడి ఏదో ఒకటి చేసే అలవాటు నాకు లేదంటాడు. అలాగే చంద్రబాబు కూడా రాజధాని విషయంలో తొందరపడకూడదనుకుని.. ఏమీ చేయకుండా గ్రాఫిక్స్ తోనే కాలం గడిపేశారు.

 

కానీ ఐదేళ్లలో అమరావతి గురించి చంద్రబాబు చూపించిన ట్రైలర్లన్నీ కలిపితే.. సినిమా అవుతుంది. సింగపూర్ మాస్టర్ ప్లాన్లు, నార్మన్ ఫోస్టర్ డిజైన్లు, రాజమౌళి సలహాలు, బోయపాటి సెట్టింగులు.. అబ్బో.. ఒకటా రెండా.. అలా చంద్రబాబు వీటిని విడుదల చేయడం.. అనుకూల మీడియా.. అహో అమరావతి.. ఆహా అమరావతి అంటూ ఊదరగొట్టడం.. గత ఐదేళ్లుగా ఇదేగా జరిగింది.

 

టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేసినా.. త‌న‌ను తాను స‌మ‌ర్ధించుకునే నాయ‌కుడు. అమ‌రావ‌తి కోసం.. సినీ వ‌ర్గాన్ని తీసుకువ‌చ్చి.. ఇక్కడ భారీ ఎత్తున సెట్టింగులు వేయించారు. ఇంకేముంది! అంటూ గ్రాఫిక్స్‌ను తెర‌ మీదికి తెచ్చారు. త‌ర్వాత వాటిని ప‌క్కన పెట్టారు. ఇప్పుడు ఏకంగా తాత్కాలిక‌మే బాగుంద‌ని అంటున్నారు. ఆయన అలా చేయడమే ఇప్పుడు జగన్ కు వరంగా మారిందని చెప్పొచ్చు. గ్రాఫిక్స్ తో కాలం గడపకుండా.. చంద్రబాబు అమరావతి నిర్మాణం చేపట్టి ఉంటే.. జగన్ దాన్ని మార్చే అలోచన చేసేవాడే కాదన్నది నిష్టుర సత్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: