ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ భేటీ వాయిదాపడింది . శనివారం మంత్రి వర్గ భేటీ జరగాల్సి ఉండగా వాయిదా వేశారు . శనివారం జరగాల్సిన మంత్రి వర్గ సమావేశం సోమవారం జరగనుంది .  తొలుత  సోమవారమే  మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినా, షెడ్యూల్ మార్చి  శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు  . అంతలోనే మంత్రివర్గ భేటీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వం , సోమవారం జరుగుతుందని వెల్లడించింది .

 

మూడు రాజధానుల ఏర్పాటు కు మంత్రి వర్గ  సమావేశం లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది  . అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై  సభ్యులు  చర్చించనున్నారు . శుక్రవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమైంది . ఈ సమావేశం లో జీఎన్ రావు కమిటీ , బోస్టన్ గ్రూప్ నివేదికల  పై  చర్చించింది . ఈ రెండు నివేదికలను అధ్యయనం  చేసిన అత్యున్నతస్థాయి కమిటీ , తన నివేదికను ప్రభుత్వానికి  సమర్పించనుంది .  సోమవారం జరిగే కేబినెట్ భేటీ లో ఈ నివేదికపై చర్చించి ఆమోదించనున్నారు . అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించి , బిల్లు పాస్ చేయాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది . ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది .

 

అయితే అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల ఏర్పాటు ప్రతిపాదన తీర్మానాన్ని ముఖ్యమంత్రి ప్రవేశపెట్టగానే , అధికార పార్టీ తరుపున మూడు ప్రాంతాల ప్రతినిధులు సమర్ధిస్తూ మాట్లాడనున్నారు . ఇక టీడీపీ ఎమ్మెల్యేలు  ఈ విషయం లో ప్రాంతాలవారీగా విడిపోయే అవకాశాలున్నాయని అధికార పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది . అదే జరిగితే రాజకీయంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడ సక్సెస్ అయినట్టేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: