ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక రకరంగా రాజధాని తరలింపు అంశం చంద్రబాబును మళ్లీ జనంలోకి వెళ్లేలా చేసింది. రాజధాని పరిరక్షణ ఉద్యమ నేతగా అవతరించారు.  రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం వైసీపీకి మద్దతునిస్తున్నందున, వారిపై ఆరోపణల దాడికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబుకు రాజధాని మహిళా రైతులపై పోలీసుల దాడి అంశం కలసి వచ్చింది. రాజధాని కోసం అక్కడి రైతులు చేస్తున్న ఆందోళన ఎక్కడి వరకూ వెళుతుంది? అందులో వారి పోరాటం ఫలిస్తుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్కంఠగా మారాయి. అయితే.. వీటితో సంబంధం లేకుండా రాజధాని రైతులు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు.  వారికి మద్దతుగా మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో అది అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. పైగా అమరావతి రాజధాని ఉద్యమం కేవలం 29 గ్రామాలకే పరిమితమయిందన్న విమర్శల నేపథ్యంలో బాబు తన నిరసన ఉద్యమాన్ని అనంతపురం, చిత్తూరు, పశ్చిమగోదావరి వరకూ విస్తరింపచేశారు.

మహిళలపైనా, పోలీసులు లాఠీచార్జి చేసిన అంశం జాతీయ అంశంగా మారింది. ఫలితంగా మహిళా హక్కుల కమిషన్ స్వయంగా బెజవాడకు వచ్చేలా చేసింది. వెంటనే హైకోర్టు కూడా సర్కారుకు అక్షింతలు వేసింది. ఇవన్నీ రాజధానిని అక్కడే ఉంచేందుకు పనికివస్తాయా? రావా? అన్నది పక్కకుపెడితే.. చంద్రబాబు నాయుడును జనంలోకి తీసుకువెళ్లేందుకు మాత్రం కచ్చితంగా అక్కరకొస్తాయని మాత్రం నిజం. ఇదిలా ఉండగా అమరావతి రాజధాని కోసం బిజెపి అగ్రనేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి సుజనా చౌదరి, పురంధ్వీరితోపాటు స్థానిక నేతలంతా రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు. కన్నా లక్ష్మీనారాయణ ఒక అడుగు ముందుకేసి, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన చోటనే మౌన దీక్ష నిర్వహించారు.

ఈ నేపథ్యంలో హటాత్తుగా చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి రాజధాని రైతుల వద్దకు రావడం చర్చనీయాంశమయింది. పైగా.. భువనేశ్వరి చేసిన ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. తన భర్త ఎప్పుడూ అమరావతి గురించే ఆలోచిస్తుంటారని, ఆయనకు తన కుటుంబం కంటే రాజధానిపైనే ఎక్కువ ప్రేమ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆకర్షించాయి. మహిళలపై దాడులు చేయడం దుర్మార్గమని, మహిళలు తలచుకుంటే ఏదైనా చేస్తారని హెచ్చరించడం బట్టి.. భువనేశ్వరి క్రమంగా రాజకీయ ప్రసంగాలకు అలవాటుపడుతున్నట్లు అర్ధమవుతుంది.

అంతే కాకుండా రైతుల ఉద్యమానికి ఆమె తన గాజు విరాళంగా ఇవ్వడంపై ప్రశంసలు, విమర్శలూ వెల్లువెత్తాయి. మళ్లీ సంక్రాంతి పండుగ రోజు చంద్రబాబు, భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి రైతుల మధ్య పండుగ చేసుకున్నారు. దీక్షలో ఉన్న రైతులకు బ్రహ్మణి తీసుకు వచ్చిన అరిసెలు పంచిపెట్టారు. ఈ క్రమంలో  నందమూరి బాలకృష్ణ కూడా రాజధాని పరిరక్షణ ఉద్యమంలోకి బాసటగా నిలిచేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే   నందమూరి-నారా కుటుంబం యావత్తు అమరావతి ఉధామంలో భాగస్వామ్యమైనట్టే మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: