బీజేపీతో కలసి నడవాలన్న పవన్ కల్యాణ్ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటానన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఏకంగా వారికి బద్ద శత్రువైన బీజేపీతో కలిసి నడవాలని డిసైడ్ కావడం విమర్శలకు తావిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ అంటేనే విరుచుకుపడే వైసీపీ నేతలు ఈ పరిణామంతో మరింత జోరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనసేన-బీజేపీ పొత్తు పరిణామంతోఇక జనసేన చరిత్ర ముగిసిందని.. వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు.

 

ఆయన ఏమంటున్నారంటే.. ” పవన్‌ కళ్యాణ్‌... మీరు సినిమాలైనా చేసుకొండి, రాజకీయాలైనా చేసుకొండి కానీ , సినిమా గ్యాప్‌లో రాజకీయాలు చేయకండి. వైయస్‌ జగన్‌ మొదటి నుంచి ఒంటరిగానే పోరాడారు. ఒంటరిగానే గెలిచారు. 2014లోనే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. పొత్తులు, కూటములపై మాకేం అభ్యంతరం లేదు. జనసేన పార్టీ ఎందుకు పుట్టిందో..ఎవరి కోసమోమ తెలియదు. జనసేన పార్టీకి సిద్ధాంతాలు లేవు. కేవలం టీడీపీ కోసమే జనసేన పార్టీని పవన్‌ నడిపిస్తున్నారని అమర్ నాథ్ విమర్శించారు.

 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. " ప్రత్యేక హోదా కానీ..రాష్ట్ర ప్రయోజనాలు కానీ పవన్‌కు అవసరం లేదు. పవన్‌ కళ్యాణ్‌ పొలిటికల్‌ ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నారు. కుటుంబ పాలన ఎవరిదో ప్రజలు తెలుసుకునే 2019లో తీర్పు నిచ్చారు. రాష్ట్రంలో ఏదో దోపిడీ జరిగిపోతున్నట్లు జనసేన, బీజేపీ ఆరోపించాయి. వైయస్‌ జగన్‌ 7 నెలల పాలన ప్రజలు చూశారు.

 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు. కమ్యూనిస్టు భావజాలం ఉందన్న పవన్‌ కళ్యాణ్‌.. ఇప్పుడు కమ్యూనిస్టులకు బాకీ ఉన్నానా అని అనడం విడ్డూరంగా ఉంది. 2024లో అధికారంలోకి వస్తామని చెబుతున్న పవన్‌ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. సిద్ధాంతాలు, స్థిరత్వం, వ్యక్తిత్వం అనేవి పవన్‌ డిక్షనరీలో లేవు. నిన్నటితో జనసేన పార్టీ అధ్యాయం ముగిసినట్లే.. అంటూ విశ్లేషించారు అమర్ నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: