రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ గురించి సుప్రీం మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ కు సుప్రీం కోర్టు విధివిధానాలను నిర్దేశించింది. సుప్రీం కోర్టు విచారణ కమిషన్ కు నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలితే ఉల్లంఘించిన వారిని బాధ్యులుగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలో ధర్మాసనం పోలీసుల ఎన్ కౌంటర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది. 
 
డిసెంబర్ నెల 12వ తేదీన దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ వ్యవహారం గురించి దర్యాప్తు జరిపి ఆరు నెలలలో నివేదిక అందించాలని సుప్రీం కోర్టు కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు జస్టిస్ సిర్పూర్కర్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ కమిషన్ లో డైరెక్టర్ కార్తికేయన్, సీబీఐ వతూజీ, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి సొండూర్ బల్డోటాలను సభ్యులుగా నియమించింది. నిన్న సుప్రీం ధర్మాసనం విచారణలో కమిషన్ ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో, ఏఏ అంశాలను నిగ్గు తేల్చాలో అనేది నిర్దేశిస్తూ విధివిధానాలను జారీ చేసింది. 
 
సుప్రీం ధర్మాసనం పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలోనే నిందితులు మహ్మద్ అరీఫ్, చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివ ఎన్ కౌంటర్ జరిగిందన్న విషయాన్ని ఉత్తర్వులలో గుర్తు చేసింది. ఎన్ కౌంటర్ జరిగిన రోజున ఎన్ కౌంటర్ జరగటానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి..? నిబంధనల ఉల్లంఘన ఈ వ్యవహారంలో ఎక్కడైనా, ఏదైనా జరిగిందా..? ఒకవేళ నిజంగా నేరం జరిగిందని తేలితే తప్పు చేసిన అధికారులు ఎవరు..? అనే అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
తప్పు చేసినట్టు తేలిన పక్షంలో సంబంధిత అధికారులను బాధ్యులు చేయాలని కోర్టు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్టింగ్ కమిషన్ ఛైర్మన్ కు లక్షన్నర రూపాయలు, మిగిలిన ఇద్దరు సభ్యులకు లక్ష రూపాయల చొప్పున చెల్లించాలని మరియు అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సుప్రీం కోర్టు సూచించింది. దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ జరిగినప్పుడు పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్చామని చెప్పినప్పటికీ బూటకపు ఎన్ కౌంటర్ అని విమర్శలు వినిపించాయి. విచారణ కమిషన్ చేసే విచారణలో ఎన్ కౌంటర్ చేసిన పోలీసులకు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: