కొన్ని రోజులుగా గమనిస్తున్నారా.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాజధాని నిర్ణయం వేళ.. వైఎస్ జగన్ కూడా అందుకు ఒప్పుకున్నారని ఇటీవల బాగా ప్రచారం జరిగింది. రాజధాని రైతులు కానీ.. టీడీపీ నాయకులు కానీ పదే పదే ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 వేల ఎకరాలు కావాలి రాజధానికి అని జగన్ అన్నట్టు సదరు నాయకులు, రైతులు మాట్లాడుతున్నారు. అప్పుడు అమరావతికి ఓకే చెప్పి.. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు.. మాట తప్పను.. మడమ తిప్పను అనే జగన్ ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ నిలదీశారు.

 

అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. జగన్ అమరావతికి ఒప్పుకున్నట్టు ఇంతగా జనంలోకి ఎందుకు వెళ్లింది.. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ సోషల్ మీడియా సర్క్యులేట్ చేసిన ఓ వీడియో.. అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా బాగా సర్క్యులేట్ చేసింది. ఆ వీడియో చూస్తే ఎవరైనా.. అవును కదా.. జగన్ ఇలా మాట తిప్పేశాడేంటీ అనుకోవడం ఖాయం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ వీడియోను టీడీపీ సోషల్ మీడియా తనకు అనుకూలంగా ఎడిట్ చేసుకుంది.

 

అమరావతిపై అసెంబ్లీ మాట్లాడుతున్నప్పుడు జగన్ వాస్తవానికి అమరావతి గా రాజధాని ఎంపిక చేయడాన్ని జగన్ స్వాగతించలేదు. అలాగని వ్యతిరేకించలేదు.. అసలు రాజధాని ఎక్కడ పెట్టాలన్న నిర్ణయం చంద్రబాబు సర్కారు తీసేసుకున్న తర్వాత ఇక అసెంబ్లీలో చర్చించేందుకు ఏముందని జగన్ నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఎవరినీ అడగకుండా సొంత నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

 

కానీ మీరు నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు వ్యతిరేకిస్తే ప్రాంతాల మధ్య విద్వేషాలు వస్తాయి కాబట్టి అమరావతిని అంగీకరిస్తున్నామన్నారు. అంతే కాదు.. 30వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోట.. రాజధాని పెడితే ఖర్చు లేకుండా ఉంటుందన్నారు. ఈ మొత్తం ప్రసంగంలోని తనకు అనుకూలంగా ఉన్న పార్ట్ ను టీడీపీ సోషల్ మీడియా ఎడిట్ చేసి ప్రచారంలోకి వదిలింది. అయితే ఇలాంటి ప్రచారాన్ని అడ్డుకోవడంలో జగన్ సొంత పత్రిక సాక్షి, సోషల్ మీడియా విభాగం ఫెయిల్ అయ్యాయి. ఇదీ వాస్తవం అని వివరించలేక పోయాయి. దాంతో జగన్ అమరావతిని అప్పట్లో స్వాగతించారన్న అభిప్రాయం బాగా జనంలోకి వెళ్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: