తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు రేటు పలుకుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో దేశంలోనే రికార్డు స్థాయిలో ఓటు రేటు పలుకుతోందని సమాచారం. ప్రముఖ పార్టీల నుండి బరిలోకి దిగిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర్య అభ్యర్థులుగా కూడా భారీ స్థాయిలో పోటీ చేస్తూ ఉండటంతో ఓటర్లకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలలో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి డబ్బు సంపాదించిన వారు ఎక్కువగా పోటీ చేస్తున్నారు. 
 
భవిష్యత్తు అవసరాల కొరకు ఎన్నికల్లో పోటీ చేసిన వీరు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో ఓటర్లను ప్రలోభపెట్టటానికి డబ్బు వెదజల్లుతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలలో మరియు కార్పొరేషన్లలో ఒక్కో వార్డుకు 2,000 నుండి 3,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. కనీసం వెయ్యి ఓట్లకు పైగా పడితే చాలు తమనే విజయం వరించే అవకాశాలు ఉన్నాయని అభ్యర్థులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
శివారు ప్రాంతాలలో ఒక్కో అభ్యర్థి 50 లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టటానికి సిద్ధమవుతున్నారని ఓటుకు ఐదు వేల రూపాయల నుండి పది వేల రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. గతంలో ఓటుకు 500 రూపాయల నుండి 2,000 రూపాయల వరకు ఇచ్చేవారని ఈ ఎన్నికల్లో ఓటు రేటు ఏకంగా ఐదు రెట్లు పెరిగిందని శివారు ప్రాంతాలలోని ఓటర్లు చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. 
 
శివారు ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించినవారు వెయ్యి ఓట్లను కొంటే చాలు సులభంగా కార్పొరేటర్ అవ్వొచ్చని ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని డబ్బు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ విశ్లేషకులు దేశంలో ఎక్కడా జరగని స్థాయిలో ఈ ఎన్నికలకు ఖర్చవుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలు కూడా డబ్బులు ఖర్చు పెట్టే నేతలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నాయని అందువలన ఓటు రేటు పెరుగుతోందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: