ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చనున్నట్టు అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో అధికారికంగా ఇంకా విశాఖను రాజధానిగా ప్రకటించకపోయినా విశాఖలో సుందరీకరణ పనులు ఊపందుకున్నాయి. రిపబ్లిక్ డే వేడుకలను విశాఖలో జరపనున్నట్టు ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో విశాఖ నగరంలో సుందరీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 
 
అధికారులు విశాఖలో 20వేలకు పైగా సీసీ టీవీ కెమెరాలను అమర్చేలా చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. జనవరి 26వ తేదీ నాటికి సీసీ కెమెరాలను అమర్చే ప్రక్రియ పూర్తి కానుందని సమాచారం. పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆర్కే బీచ్ భీమిలి మధ్య మార్గం మరింత సుందరంగా మారనుందని తెలుస్తోంది. 
 
అదనపు హంగులను ఈ మార్గంలో జోడించేలా చర్యలు చేపట్టారని సమాచారం. ప్రభుత్వం సుందరీకరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికే నిధులను విడుదల చేసిన విషయం విదితమే. ఆర్కే బీచ్ భీమిలి మార్గంలో ట్రామ్ వే ట్రైన్ ను నడిపించడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన సర్వే కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. విశాఖలోని ప్రధాన రోడ్డు మార్గాలలో ఇరువైపులా అందమైన బొమ్మలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. 
 
రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో విశాఖ సముద్ర తీర ప్రాంతానికి నూతన శోభ వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరు కానున్నారు. సీఎం జగన్ వైజాగ్ లోని హోటళ్లో బస చేయనున్నారని తెలుస్తోంది. విశాఖలో సీఎం జగన్ సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 20వ తేదీన కేబినేట్ భేటీ జరగనుంది. కేబినేట్ భేటీని 18వ తేదీకి మార్చినట్టు వార్తలు వచ్చినా సోమవారం ఉదయం 9 గంటలకు కేబినేట్ భేటీ జరిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: