తెలంగాణ‌లో జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ త‌మ‌కు పోటీ కాద‌ని చెప్తున్న‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ వేస్తామని బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ భ‌గ్గుమ‌న్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నందుకే టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ వేస్తామంటున్న వారు... దేశాన్ని, రాష్ర్టాన్ని దశాబ్దాలపాటు పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌లపై మేము ఎన్ని చార్జిషీట్లు వేయాలి? అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఆరేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి అదనంగా ఒక్కపైసా నిధులు ఇచ్చిందా? ఒక్క మంచి పని అయినా చేసిందా? అని నిల‌దీశారు. 

 

టీఆర్‌ఎస్‌పై చార్జిషీట్‌ వేయడం కాదు.. ముందుగా అన్నిస్థానాల్లో అభ్యర్థులను నిలపండని బీజేపీపై కేటీఆర్ సెటైర్లు వేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రతిపక్షాలకు అభ్యర్థులు ఎందుకు దొరుకడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ల‌లో రాష్ర్టానికి చేసిన ఒక్క మంచిపని కూడాలేదని, రాష్ట్రం నుంచి వెళ్లిన నిధులు కూడా తిరిగి రావడం లేదని విమర్శించారు.  బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీలు ఎక్కడున్నాయో చూపెట్టాలని.. రాష్ట్రంలో ప్రకటించిన రెండు స్మార్ట్‌సిటీలకు ఎన్ని నిధులు ఇచ్చారో ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పాలని నిలదీశారు. అమృత్‌ పథకంతో ఎన్ని పట్టణాలు అమృతాలొలుకుతున్నాయి? అని ఎద్దేవాచేశారు. మీ విధానం చెత్త మున్సిపాలిటీలు అయితే.. తమవి కొత్త మున్సిపాలిటీలని వివరించారు. 

 

ప్రతిపక్షాలది గుడ్డి వ్యతిరేకత అని, తెలంగాణ ఉద్యమకాలం నుంచీ వాటిది వితండవాదమేనని విమర్శించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని.. జగిత్యాల, కరీంనగర్‌, నిజామాబాద్‌, నారాయణపేట, నిర్మల్‌ సహా అనేకచోట్ల జాతీయపార్టీలు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ రెబెల్‌ అభ్యర్థుల సమస్య 95 శాతం పరిష్కారమయిందని, ఒకటి రెండుచోట్ల ఉన్నవారు త్వరలోనే దారికి వస్తారని చెప్పారు. ప్రజల ఆదరణ ఉన్నది కాబట్టే టీఆర్‌ఎస్‌లో బీ ఫాంలకు పోటీ పెరిగిందని చెప్పిన కేటీఆర్‌.. ప్రజాదరణ లేకపోవడం వల్లే ప్రతిపక్షాల నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. మున్సిపోల్స్‌లో తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అన్నిపార్టీల జాతకాలు ఈ నెల 25న బయటపడుతాయని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: