తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల పైన పూర్తిగా ఫోకస్ పెంచాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని తిరుగులేని శక్తిగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మున్సిపల్ ఎన్నికలను రెఫరెండం గా చూపించాలని భావిస్తున్నారు. ఇక నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టిఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. 


దీనిలో భాగంగా నిజామాబాద్ కార్పొరేషన్ కు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. నిజామాబాద్ కార్పొరేషన్ లో బిజెపి గెలిచి మేయర్ స్థానాన్ని దక్కించుకుంటే  మొదటగా నిజామాబాద్ పేరు ఇందురుగా మార్చేస్తామని బిజెపి ప్రకటించింది. టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ మేయర్ కార్పొరేషన్ ఎంఐఎంకు అప్పగించేందుకు చూస్తోందని అరవింద్ ఇప్పటికే సంచలన విమర్శలు చేశారు. అలాగే గురుకులాల్లో బలవంతపు మాత మార్పుడులు జరుగుతున్నాయని అరవింద్ విమర్శించారు. కార్పొరేషన్ పై బీజేపీ జెండా రెపరెపలాడిస్తే ఇక్కడ ఎటువంటి కమిషన్లు లేకుండా అభివృద్ధి నిధులు సద్వినియోగం అయ్యేలా చూస్తామని బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించింది.  


అలాగే నిజామాబాద్ పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి నిజామాబాద్ కార్పొరేషన్ లో విలీనమైన అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామంటూ బిజెపి మేనిఫెస్టోలో ప్రకటించగా దానికి ధీటుగా హామీలు ఇస్తూ టీఆర్ఎస్ పార్టీ గట్టిగా ప్రచారం చేస్తోంది. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ మొత్తం ఫోకస్ అంతా ఇక్కడే పెట్టి టీఆర్ఎస్ కీలక నాయకులపైనా విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కు రాజకీయ పరిజ్ఞానం లేదని, ప్రధాని మోదీ గురించి ఒక్క మాట మాట్లాడినా తాను ఊరుకునేంది లేదంటూ టీఆర్ఎస్ నాయకులను అరవింద్ హెచ్చరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: