మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ వార్ ఊపందుకుంది. మున్సిపాలిటీలన్నింటిపైన గులాబి జెండా ఎగరేయాలని అధికార టీఆర్‌ఎస్‌ ట్రై చేస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్‌ జోరుకు చెక్ చెప్పాలని విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే అటు అధికార పక్షానికీ, ఇటు విపక్షాలకూ కొన్ని ఇబ్బందులున్నాయి. 

 

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 19 మున్సిపాలిటీలున్నాయి. అయితే జడ్చర్ల, అచ్చంపేట మున్సిపాలిటీలు మినహా 17 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ మొదలు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇదే జోరు మున్సిపోల్స్‌లో కూడా చూపిస్తామని టీఆర్‌ఎస్‌ ధీమాగా చెప్తోంది. విపక్ష కాంగ్రెస్, బీజేపీలు సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలే టీఆర్‌ఎస్‌ ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ వైఫల్యాలు, టీఆర్‌ఎస్‌లో కుమ్ములాటలు తమకు లాభిస్తాయని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.

 

జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నిక రసవత్తరంగా మారింది. మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఆరు నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నాయకులను తమ వైపు తిప్పుకోవడంలో గులాబీ పార్టి సఫలమైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీంతో కేసీఆర్‌ సూచనల మేరకు మంత్రి శ్రీనివాసగౌడ్ పట్టణంపై స్పెషల్‌ కాన్సన్‌ట్రేషన్ పెట్టారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తూ ప్రత్యర్థిపార్టీలకు అవకాశం లేకుండా వ్యవహరించారు.

 

 మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్‌దే హవా.! అయితే ఇటీవలికాలంలో ఆ పార్టీ డీలా పడిపోయింది. కొన్నిచోట్ల అభ్యర్థులను సైతం నిలబెట్టలేని పరిస్థితికి చేరింది. తామే టీఆర్‌ఎస్‌కు పోటీ అని చెప్తూ వచ్చిన బీజేపీ కూడా ఇక్కడ బలహీనపడింది. పార్లమెంట్ ఎన్నికల జోష్‌ను కొనసాగించలేకపోతోంది. 36 వార్డుల్లో మాత్రమే అభ్యర్థులను నిలపగలిగింది. మైనార్టీ ప్రాబల్యం ఉన్న 14 వార్డుల్లో ఎంఐఎం బరిలో దిగింది. 

 

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీని భారీ మెజార్టీతో గెలుచుకోవడం ఖాయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ ధీమాగా ఉన్నారు. మరోవైపు.. బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. కాంగ్రెస్‌కే గ్రౌండ్‌ లెవల్లో కేడర్ ఉండడంతో కాస్తోకూస్తో ప్రభావం చూపించే అవకాశం ఉంది.

 

ఇక వనపర్తి మున్సిపాలిటీలో మొదటి నుంచి కాంగ్రెస్, టీడీపీలదే హవా! అయితే ఈసారి గులాబీ జెండా ఎగురేస్తామని అధికార టీఆర్‌ఎస్‌ చెబుతోంది. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నమంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి పురపీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. 33 వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపించుకునేందుకు వ్యూహ రచన చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలో చేసిన పట్టణాభివృద్దిని వివరిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. 


.
కాంగ్రెస్ కూడా వనపర్తిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారపర్వంలోనూ మాజీమంత్రి చిన్నారెడ్డి ముందుంటున్నారు. అధికార పార్టీని  ఎండగడుతూ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారు. టిడిపి, బిజెపిలు పలువార్డుల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నాయి. టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కలిసి టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. బీజేపీ తమకు ప్రాబల్యం ఉన్న వార్డుల్లో అభ్యర్ధులను నిలిపింది.

 

ఇక గత ఎన్నికల వరకు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గద్వాల మున్సిపాలిటీలో ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందడం, ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో కూడా గులాబీ జెండా రెపరెపలాడడంతో ఆ పార్టీ మంచి జోష్‌ మీదుంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబున్నారు.

 

మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న డికె ఆరుణ బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరవర్గాన్ని గెలిపించుకోవడం ద్వారా పునర్వైభవం సాధించాలని ఆమె భావిస్తున్నారు. ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే ఉండనుంది. కాంగ్రెస్ కొన్ని వార్డుల్లోనే పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

 

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి మున్సిపాలిటీ నారాయణ పేటలో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మొదటి నుంచి ఇక్కడ కాంగ్రెస్, బీజేపీల అధిపత్యం కొనసాగుతోంది. అయితే ఈ సారి గులాబీ జెండా ఎగరేయడం ఖాయమంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నికైన చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్‌లు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇచ్చిన మాట మేరకు నారాయణ పేటను జిల్లా చేయడంతో తమకు తిరుగుండదని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది.
 ఇక్కడ బీజేపీకి కూడా మంచి పట్టుంది. గతంలో పలుమార్లు ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న చరిత్ర ఉంది. ఇదే ట్రెండ్‌ను మళ్లీ కంటిన్యూ చేయాలని కమలదళం భావిస్తోంది. తాము గెలిచే మున్సిపాలిటీలలో నారాయణపేటే ముందుంటుందనేది బీజేపీ నేతల మాట.! కాంగ్రెస్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఇక్కడ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే వార్‌ జరగనుంది.

 

 రియల్ ఎస్టేట్‌కి అడ్డాగా ఉన్న షాద్ నగర్ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అయితే ఛైర్మన్ సహా పలువురు కౌన్సెలర్లు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఈసారి గెలుపు మాదేనంటోంది టీఆర్‌ఎస్. 

మరింత సమాచారం తెలుసుకోండి: