మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకీ చావో రేవోలా మారాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కంటే... పార్లమెంట్ ఎన్నికల్లో కొంత మెరుగైన ఫలితాలే సాధించిన హస్తం పార్టీ.. స్థానిక ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీని ఎదుర్కోలేకపోతోంది. మున్సిపల్ ఎన్నికల్లో....అధికార పార్టీ వైఫల్యాలనే ప్రధాన ప్రచార ఆస్త్రాలుగా మార్చుకుంటోంది. 

 

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అభ్యర్ధుల ఎంపిక నుంచి... పార్టీ నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలు, జిల్లాలకు కో ఆర్డినేటర్లును నియమించింది. పార్టీలో సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పొన్నాల, వీహెచ్ లాంటి నాయకులకు కార్పోరేషన్ల బాధ్యతలు అప్పగించింది పార్టీ. తెలంగాణలో రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత... ప్రభుత్వం ఇచ్చిన హామీలు... వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనికి తోడు.. ఎన్నికల వ్యవస్ధను ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తుందనే అంశాలను జనం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంది. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని బలవంతంగా విత్ డ్రా చేయించినా...అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తోంది. ఆదిలాబాద్ లో ఎన్నికలు వాయిదా వేయాలని కూడా డిమాండ్ చేసింది. కేవలం ఆదిలాబాద్ లోనే కాదు... చాలా చోట్ల ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధలును టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేసి ఎన్నికలను ఏకపక్షం చేసుకునే కుట్ర చేస్తుందని ఆరోపించింది.

 

త్వరలోనే పీసీసీ మార్పు ఉంటుందని చర్చ జరుగుతున్న తరుణంలో...పార్టీలో ముఖ్యనాయకులంతా తమ పరిధీలోని కార్పోరేషన్లు, మున్పిపాలిటీల మీద దృష్టిసారించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన నియోజకవర్గంలోని మున్పిపాలిటీల మీద కన్నేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల్లో ఇబ్బంది పడ్డ ఆయన... కనీసం మున్పిపాలిటీ ఎన్నికల్లో అయానా పరువు నిలబెట్టుకోవాలనుకుంటున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మున్నిపాలిటీలతో పాటు... తన అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ మీద కూడా నజర్ పెట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా సొంత నియోజకవర్గం మధిర మీద ఎక్కువ కన్నేశారు. అటు పీసీసీ రేసులో ఉన్న మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ,... నియోజకవర్గంలో అన్నీ తానై పనిచేస్తున్నారు. తనకు ఇంచార్జీగా ఇచ్చిన భూపాలపల్లి జిల్లా వ్యవహారాలు కూడా ఆయనే చూసుకుంటున్నారు. 

 

మున్సిపల్ ఎన్నికల్లో జనంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసింది. మున్సిపాలిటీలో గెలిస్తే... ఏం చేస్తామనే అంశాలను జనంలోకి తీసుకెళ్లటానికి కర పత్రాలు సిద్దం చేసింది. మైనార్టీల ఓటు బ్యాంకు కోసం...సీఏఏ అంశాన్ని కూడా తేరమీదకు తెస్తోంది. ఎంఐఎం- టీఆర్ఎస్ రెండు పార్టీలు బీజేపీకి బీ టీమ్ లే అని జనంలో ప్రచారానికి పెట్టింది. మున్సిపల్ ఎన్నికల్లో అసలు బీజేపీ పోటీలోనే లేదన్నారు. ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ ని చిత్తు చిత్తు గా ఓడించండి అని పిలుపు నిచ్చారు. ప్రతీ ఎన్నికలకు కాంగ్రెస్ గ్రాఫ్ కొంత పెరుగుతుందన్న ధీమాతో నాయకులు ఉన్నా... మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: