కోమటిరెడ్డి సోదరులకు మున్సిపోల్స్ ప్రతిషాత్మకంగా మారాయి . ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ , భువనగిరి మున్సిపాలిటీలను గెలిపించుకునేందుకు భువనగిరి  ఎంపీ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తుండగా, ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ... చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే విధంగా  పావులు కదుపుతున్నారు . నల్గొండ మున్సిపాలిటీ ని గతం లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే  .

 

 గతం లో  నల్గొండ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు . నల్గొండ మున్సిపాలిటీ ని గెల్చుకుని తన గెలుపు అంత ఆషామాషీ గెలుపేమి కాదని నిరూపించుకోవాలని భూపాల్ రెడ్డి కృతనిశ్చయం తో ఉన్నారు . ఇక కోమటిరెడ్డి తాను అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన , నల్గొండ లో తన  పట్టు తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు . మరోసారి మున్సిపల్ చైర్మన్ పీఠం పై తన అనుచరుణ్ణి  కూర్చోబెట్టాలని ఆయన  పావులు కదుపుతున్నారు . నల్గొండతోపాటు భువనగిరి మున్సిపాలిటీలలో పోటీ చేస్తోన్న కాంగ్రెస్ అభ్యర్థుల  గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు .

 

నూతనంగా ఏర్పడిన  చండూరు , చౌటుప్పల్ మున్సిపాల్టీలలో   కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు . మునుగోడు నియోజకవర్గ పరిధిలోని ఈ రెండు మున్సిపాలిటీలను గెల్చుకుంటే , భవిష్యత్తులో రాజకీయంగా తనకు తిరుగు ఉండదని ఆయన భావిస్తున్నారు . అయితే ఇక్కడ టీఆరెస్ కూడా బలంగా ఉండడం...ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయంగా ఊగిసలాట ధోరణి ప్రదర్శించడం వంటి అంశాలు ఓటర్లపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: