ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోర తప్పిదం చేశారన్నారు. ఢిల్లీలో ఉండే సోనియా.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంతో తెలుసుకోలేకపోతున్నారు. దీని ఫలితంగా మొగలుల సామ్రాజ్యం క్షీణించినట్టు కాంగ్రెస్ పరిస్థితి కూడా దిగజరిపోతోందన్నారు.

 

ప్రధాని నరేంద్ర మోడీ ముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలువలేకపోతున్నారన్నారు చరిత్రకారుడు రామచంద్ర గుహ. స్వాతంత్ర్య సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించినా, ఆ తర్వాత పార్టీలో రాచరికం రావటంతో, గ్రాఫ్‌ పడిపోతుందన్నారు. కేరళ సాహిత్య ఉత్సవం వేదికగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

 

రాహుల్ని ఎన్నుకొని కేరళ ప్రజలు ఘోరమైన పని చేశారని వ్యాఖ్యానించారు రామచంద్రగుహ. స్వయంగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీపై ఐదోతరానికి చెందిన వారసుడు రాహుల్ గెలిచే అవకాశం లేదన్నారు. ఒకప్పుడు ఘనంగా వెలుగొందిన కాంగ్రెస్ దయనీయమైన కుటుంబ సంస్థగా మారిందన్నారు. ఇదే దేశంలో హిందుత్వ, యుద్ధోన్మాద ప్రాబల్యం పెరగడానికి  కారణమయిందన్నారు. 

 

యంగ్ ఇండియా ...గాంధీ-నెహ్రూ ఐదో తరం నేతను అంగీకరించబోదని చెప్పారు. 2024లో  కేరళ నుంచి రాహుల్ గాంధీని ఎన్నుకుంటే అది ప్రధాని మోడీకి ప్రయోజనం  అని వయనాడు ప్రజలనుద్దేశించి అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాబల్యం కుచించుకుపోతోందంటున్న ఆయన సోనియా ఢిల్లీకే పరిమితమయ్యారని.. విమర్శించారు. పార్టీలోని కొందరు వ్యక్తులు అధిష్ఠానానికి తప్పుడు సమాచారం అందిస్తున్నారని ఆరోపించారు. మొఘల్ పాలన మాదిరిగా కాంగ్రెస్ ప్రాబల్యం అంతకంతకు అంతరించిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. తమ అభిమాన నేతపై ఇలాంటి విమర్శలు చేస్తారా అంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాటల దాడికి సిద్ధమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. మరి చూడాలి రామచంద్ర గుహ వ్యాఖ్యలు మున్ముందు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయే..!

మరింత సమాచారం తెలుసుకోండి: