కేంద్రంలో తిరుగులేని మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ఏపీలో అంత సీన్ ఉందా? మూడు రాజధానుల ఏర్పాటుని అడ్డుకునే శక్తి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన కమలనాథులకు సాధ్యమయ్యేనా? అంటే అసాధ్యమనే చెప్పాలి. గతంలో ఉమ్మడి ఏపీలో కేవలం హైదరాబాద్ మాత్రం అభివృద్ధి చెందడం వల్ల ఏపీకి ఎంత నష్టం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి నష్టం మరొకసారి జరగకూడదనే ఉద్దేశంతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం...మూడు రాజధానుల ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.

 

ఈ విషయంపై దూకుడుగా వెళుతున్న జగన్ ప్రభుత్వం..మరికొన్ని రోజుల్లో మూడు రాజధానులని ఏర్పాటు చేయడం ఖాయమైంది. అయితే తమ ఆస్తులన్నీ అమరావతిలోనే ఉండటంతో ఈ మూడు రాజధానులని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకిస్తుంది. దీనికి తోడు జనసేన, బీజేపీ సహ పలు ప్రతిపక్షాలు రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే..జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు. కానీ దీన్ని అడ్డుకునే శక్తి బీజేపీకే ఉందని టీడీపీతో సహ మిగిలిన ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

 

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆపేయోచ్చని అంటున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపిన కేంద్రానికి అమరావతి చిన్న విషయమేనని, అమరావతిపై కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని మాట్లాడారు. అయితే వీరు ఇలా మాట్లాడుతున్న, ఏపీలో పెద్దన్న పాత్ర పోషించే సీన్ బీజేపీకి లేదు.

 

ఇదే విషయం కేంద్ర పెద్దలు పలు మార్లు వ్యాఖ్యానించారు కూడా. ఏదో రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు గానీ...ఆ నిర్ణయాన్ని ఆపే శక్తి వారికి లేదనే చెప్పాలి. రాజధాని విషయం అనేది కేవలం రాష్ట్ర పరిధిలోనేదే. నిధులు ఇచ్చే విషయంలో మాత్రం కేంద్రం పాత్ర ఉంటుంది. కాబట్టి రాజధాని ఏర్పాటు విషయంలో బీజేపీ పెద్దన్న పాత్ర పోషించడం కుదరని పని.

మరింత సమాచారం తెలుసుకోండి: