తెలుగుదేశం అధినేతగా ఉన్న చంద్రబాబు...తన అవసరాల కోసం ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. అధికారమే లక్ష్యంగా ఆయన శత్రు పక్షాలుగా ఉన్న పార్టీలతో సైతం పొత్తు పెట్టుకుని ముందుకెళ్లారు. ఆఖరికి దశాబ్దాల పాటు వైరి పక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. అయితే పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం కొత్త విషయమేమి కాదు. కానీ బాబు మాత్రం ప్రత్యర్ధ పార్టీల పైన దారుణమైన విమర్శలు చేసి...మరి తర్వాత పొత్తు పెట్టుకుంటారు. అలా బీజేపీతో ఎన్నిసార్లు పొత్తు పెట్టుకున్నారో చెప్పనక్కర్లేదు. 2019 ఎన్నికల సమయంలో కూడా బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. తీరా ఎన్నికల్లో ఓడిపోయాక బీజేపీ వెనకాలా పడుతున్నారు.

 

సరే చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు వీటి గురించి పెద్దగా మాట్లాడుకోరు. ఆయన అవసరాల బట్టి నడుస్తారని అనుకుంటారు. కానీ చంద్రబాబు పార్ట్‌నర్‌గా పేరు కొట్టేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే బాటలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ పెట్టిన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు రాజకీయాలని బాగా వంటపట్టించుకున్నట్లు కనిపిస్తుంది. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ పెట్టి.. ఆ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీకి పవన్ మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పొత్తు నుంచి బయటకొచ్చి టీడీపీ-బీజేపీలపై ఓ రేంజ్ ఓ విమర్శలు చేశారు.

 

ఇక 2019 ఎన్నికలకు వచ్చేసరికి పవన్...వామపక్షాలు, బీఎస్పీతో కలిసి ముందుకెళ్లారు. ఆ ఎన్నికల్లో చావుదెబ్బ తిని ఎలాగోలా ఒక సీటు గెలిచారు. ఆ విషయం పక్కనబెట్టేస్తే...ఎన్నికలో ఓటమి పాలైన దగ్గర నుంచి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అది కూడా చంద్రబాబు ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో అదే లైన్ లో మాట్లాడుతూ వచ్చారు. ఇక దీని బట్టి చూస్తే పార్ట్‌నర్‌లు ఇద్దరు కలిసే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అర్ధమైంది. ప్రతిపక్షంలో కూడా పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారని ప్రజలకు ప్రత్యక్షంగా కనబడింది.

 

అయితే వీరి బంధం ఇలాగే కొనసాగుతుందనుకునే తరుణంలో పవన్...బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుని ముందుకొచ్చేశారు. బీజేపీతో కలిసి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇలా పవన్ పార్టీ పెట్టి 10 సంవత్సరాలు కాకముందే అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటూ...తన బాస్ చంద్రబాబునే దాటిపోయేలా కనిపిస్తున్నారు. మొత్తానికి పవన్...చంద్రబాబు రాజకీయాలని నేర్చేసుకున్నట్లే కనబడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: