అవసరాలకు అనుగుణంగానే రాజకీయాలు నడుస్తాయనేది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలని చూస్తే అర్ధమైపోతుంది. గత ఐదేళ్లు పాటు అధికారంలో ఉండి...రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి...అమరావతిని అధోగతి పట్టించి, ఇప్పుడు పోరాటాల పేరిట రోడ్లెక్కి రచ్చ చేస్తున్నారు. ఎప్పుడైతే సీఎం జగన్ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానుల అంశాన్ని మాట్లాడారో అప్పటి నుంచి...అమరావతినే రాజధానిగా ఉంచాలని టీడీపీ నేతలు తెగ హడావిడి చేసేస్తున్నారు. ప్రజలు పాలన వికేంద్రీకరణ కోరుకుంటున్న వీరు మాత్రం, ప్రజలని రెచ్చగొడుతూ రాజకీయ ప్రయోజనం పొందాలని తెగ కష్టపడుతున్నారు. అలాగే అమరావతిలో ఉన్న తమ ఆస్తుల విలువ తగ్గకూడదని పోరాటం చేస్తున్నారు.

 

అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి అసలు బయటకు రాని కొందరు టీడీపీ నేతలు...ఇప్పుడు మాత్రం అమరావతినే రాజధానిగా ఉంచాలని పోరాటాలు, ఆందోళనలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ప్రత్తిపాటి పుల్లారావు, ధూళ్లిపాళ్ళ నరేంద్ర, జి‌వి ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా, మాగంటి బాబు, పరిటాల ఫ్యామిలీ ఇలా పలువురు నేతలు రోడ్ల మీదకొచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఇలా గొంతు చించుకుంటున్న వీరు ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి బయట కనపడలేదు.

 

టీడీపీ అధినేత చంద్రబాబు సహ పలువురు నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఏదొక వంక పెట్టుకుని పోరాటాలు చేస్తున్న...వీరు మాత్రం నోరు మెదపలేదు. కానీ ఎప్పుడైతే మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిందో...అప్పటి నుంచి అమరావతినే రాజధానిగా ఉంచాలని అధినేతతో కలిసి ఉద్యమం చేస్తున్నారు. ఇక వీరు ఇలా ఉద్యమం ఎందుకు చేస్తున్నారో ప్రజలకు ఈ పాటికే అర్ధమైంది.

 

కేవలం వీరు ఆస్తులు కాపాడుకోవడం, సొంత ప్రయోజనాలు కోసమే ఉద్యమిస్తున్నారని తెలిసింది. అందుకే వీరు చేసే ఉద్యమాలకు ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన రావడం లేదు. ఏదో కొంతమంది టీడీపీ కేడర్ తప్ప, వీరి వెనుక అసలు జనం ఉండటం లేదు. మొత్తానికైతే ఈ టీడీపీ నేతలు సొంత అవసరాల కోసమే పోరాటాలు చేస్తున్నారని ప్రజలకు బాగా అర్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: