ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు కాస్తా ... ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభార్ రెడ్డి మధ్య అన్నట్టుగా పరిస్థితి తయారయింది . ఈ రెండు మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ఇద్దరు నేతలు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు . అభ్యర్థులను కాదు ... తమని చూసి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నారు . ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చని టీఆరెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతుందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు .

 

ఘట్టుప్పల్ ను మండల కేంద్రంగా ప్రకటించాలని ఎన్నిమార్లు కోరిన పట్టించుకోలేదని , ఇక చర్లగూడెం ప్రాజెక్టు ఊసే ఎత్తడం లేదని విమర్శించారు . డబ్బులున్నాయని ఓట్లను కొనుగోలు చేసి, గెలవాలని టీఆరెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు . గత ఆరేళ్లుగా రాష్ట్రం లో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమని గెలిపిస్తాయని కూసుకుంట్ల అంటున్నారు .  తాజా , మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఈ రెండు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించడం తో పోటీ రసవత్తరంగా మారింది .  చండూరు , చౌటుప్పల్ లు  నూతన మున్సిపాలిటీలుగా ఏర్పడ్డాయి . ఈ రెండు మున్సిపాలిటీ లు శరవేగంగా విస్తరిస్తున్నాయి .

 

స్థానికంగా కనీస  మౌలిక వసతులు లేవు . రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాల్సిన అవసరముంది . ఇక శానిటేషన్ సమస్య రెండు మున్సిపాలిటీల్లో ప్రజలను వేధిస్తోంది . మేజర్ గ్రామపంచాయితీలు గా అంతో , ఇంతో అభివృద్ధికి నోచుకున్న ఈ రెండు గ్రామాలు , మున్సిపాలిటీ లుగా రూపాంతరం చెందడం ,ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . చండూరు , చౌటుప్పల్ మున్సిపాలిటీ లలో  మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం ప్రయత్నించే వారికే తాము మద్దతునిస్తామని స్థానికులు చెబుతున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: