రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు పెట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు జగన్ సర్కార్ కావల్సిన పనులని సైలెంట్‌గా చక్కబెట్టుకుంటుంది. ఇందులో భాగంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రాజధాని బిల్లుకు ఆమోద ముద్రవేసి, వెంటనే అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేసి..అక్కడ కూడా బిల్లుకు ఆమోద ముద్ర పడేలా చేయాలని భావిస్తుంది. అయితే ఈ కార్యక్రమం సవ్యంగానే జరిగిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

ఎందుకంటే వైసీపీకి బంపర్ మెజారిటీ ఉంది కాబట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోతుంది. ఇక టీడీపీ ఎలాగో మూడు రాజధానుల అంశంపై వ్యతిరేకంగా ఉంది కాబట్టి...ఈ బిల్లుని వ్యతిరేకించడం ఖాయం. అయితే టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలు ఒక లైన్‌లోనే ఉంటారా? అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాలి గిరి టీడీపీకు గుడ్ బై చెప్పేశారు. కాబట్టి వారు ప్రభుత్వానికి మద్ధతు తెలపడం ఖాయమని అర్ధమైపోతుంది. అయితే వీరిని పక్కనబెట్టేస్తే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించిన, విశాఖకు చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

ఎప్పుడైతే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించారో అప్పుడే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. అలాగే గంటాతో పాటు మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్, వెలగపూడి రామకృష్ణ, గణబాబులు కూడా ప్రభుత్వ నిర్ణయానికి మద్ధతు పలికారు. అటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా వీరితో పాటే నడిచారు. ఇలాంటి తరుణంలో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు కూడా, దానికి అనుకూలంగానే వారు నడుచుకుంటారని అర్ధమవుతుంది.

 

ఒకవేళ వైసీపీకు ఎలాగో ఓ వైపు ఫుల్ మెజారిటీ ఉంటుంది, మరో వైపు టీడీపీ విప్ జారీ చేయనుండటంతో బిల్లుకు వ్యతిరేకంగా వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే బిల్లుని వ్యతిరేకిస్తే విశాఖకు ప్రజలకు ద్రోహం చేశారని వైసీపీ నేతలు విమర్శలు చేసే అవకాశం ఉంది. కాబట్టి విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎలా నడుచుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం వీరు బాబుకు మాత్రం పెద్ద షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: