తన నటనతో ఒక తమిళనాడులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ రజనీ కాంత్ వయస్సు మీరైనా ఇంకా హీరోగా నటిస్తూ కుర్ర హీరోలకు సవాల్ విసురుతున్నాడు. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా రజనీకాంత్ ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. 

 

ఇటీవల జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజిని ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజినీ వ్యాఖ్యలపై ద్రావిడర్ విడుదలై కళగం నాయకులు మండిపడుతున్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో పెరియార్ గౌరవ ప్రతిష్టలు బంగారం కల్పించాలంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌ అధ్యక్షుడు మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్ ను కించపరిచిన రజినీకాంత్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో కోరారు. మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రజినీకాంత్ కేసు నమోదు చేశారు.

 

అసలు ఏమైంది అంటే ... ? 

 

తుగ్లక్ పత్రిక వార్షికోత్సవంలో ఈనెల 14వ తేదీన రజనీకాంత్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 1971లో సేలం లో నిర్వహించిన ర్యాలీ గురించి ప్రస్తావించారు. అప్పట్లో సీతారాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారు అంటూ  రజినీకాంత్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది అంటూ రజనీ చెప్పుకొచ్చారు.

 

రజనీ వ్యాఖ్యలు పెరియార్ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయి అంటూ ద్రవిడర్‌ విడుదలై కళగమ్‌  నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రజినీకాంత్ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేసారంటూ వారు మండిపడుతున్నారు. ఈ వ్యవహారం మరింతగా ముదిరేలా కనిపిస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారు అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: