సత్తుపల్లి.. ఖమ్మంలోనే ఆసక్తికరమైన రాజకీయ పోరు ఉన్న నియోజక వర్గం ఇది. అనేక మంది రాజకీయ దిగ్గజాలకు రాజకీయంగా కీలకమైన స్థానం ఇది. ప్రత్యేకించి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మంత్రి పదవులు అలంకరించారు.

 

అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ అయినప్పటి నుంచి తుమ్మల రాజకీయంగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సివచ్చింది. అయినప్పటికీ తుమ్మలకు ఈ నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. ప్రస్తుతం ఈ అసెంబ్లీ స్థానం నుంచి సండ్ర వెంకటవీరయ్య టీడీపీ నుంచి గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన కూడా టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలంగా ఉందనే చెప్పాలి.

 

అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి కొందరు బలమైన స్థానికనేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. ఈ పరిణామాలు అధికార పార్టీలో భాజపా గుబులు రేపుతున్నాయి. పార్టీ 12 వార్డుల్లో పోటీ చేస్తున్నా.. ఇప్పుడు అంతా బీజేపీ గురించే మాట్లాడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీ చేరిన ఉడతనేని అప్పారావు తదితరులు ఆ పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు.

 

ఉడతనేని బీజేపీలోకి రావడంతో కూసంపూడి రవీంద్ర, నంబూరి రామలింగేశ్వరరావు తదితరులతోపాటు స్తబ్దుగా ఉన్న నేతలంతా బయటకు వచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వచ్చిన సమయంలో పట్టణంలో బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆరోజు వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయకుండా జనం సభ పూర్తయ్యేవరకు ఉన్నారు. దీంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. మరోవైపు టీఆర్ఎస్ లో పరిణామాలతో తుమ్మల నాగేశ్వరరావు సైలంట్ గా ఉన్నారు. మరి ఆయన మద్దతు ఎవరికి ఉంటుందో.. ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి సత్తుపల్లి ఓటర్లలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: