ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ఏపీ సీఎం జగన్ ఎంత మొండిగా ముందుకు వెళ్తున్నాడో అంతే మొండిగా దాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించి బిల్లు రూపంలో దానిని అధికారికంగా తీసుకురావాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా బయట ప్రచారం జరుగుతుండడంతో దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. జనవరి 20 నుంచి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 


ప్రభుత్వ లెక్కల ప్రకారం హైపవర్ కమిటీ నివేదిక రావడం, కేబినెట్లో చర్చించి అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉండడంతో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.  రాజధాని వికేంద్రీకరణకు బ్రేక్ వేసేందుకు టిడిపి కూడా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే ఆదివారం ఉదయం 10:30 కు తెలుగుదేశం పార్టీ శాసనసభపక్ష భేటీ కాబోతోంది. దానికి ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీలు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలంటూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. 


బిల్లు రూపంలో రాజధాని మార్పులను సభ ముందుకు కనుక వైసిపి తీసుకువస్తే అడ్డుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలని చంద్రబాబు సూచించబోతున్నారు. ఒకవేళ అసెంబ్లీలో బిల్లును అడ్డుకోవడం సాధ్యం కాకపోతే శాసనమండలిలో ఓడించే తీరాలని వారికి చెప్పబోతున్నారట. బిల్లు రూపంలో కాకుండా తీర్మానం రూపంలో వచ్చినా ప్రభుత్వానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం దక్కకుండా చేయాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. 


శాసనమండలిలో ప్రభుత్వ తీర్మానాన్ని ఓడించడం తోపాటు, అమరావతిలోని రాజధాని ఉండాలంటూ ప్రైవేటు తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదించుకోవాలని టిడిపి నేతలు భావిస్తున్నారు. దీంతోపాటు సోమవారం అసెంబ్లీ పరిసర ప్రాంతంలో రాజధాని ప్రాంత రైతులు, మహిళలతో దిగ్బందించాలని  టిడిపి పిలుపు ఇవ్వబోతోంది. అలాగే రాజధాని విభజన అంశం కూడా సోమవారం హైకోర్టులో విచారణకు రాబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: