పవన్ కళ్యాణ్ తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నూతన పొత్తుకు తెరతీశారు. దాని ప్రభావం ఉంటుందా.. ఉండదా అనేది పక్కకు పెడితే... ఒక నూతన రాజకీయ సమీకరణం అని మాత్రం చెప్పక తప్పదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు తొలిసారి రాజకీయ వేదికపైకెక్కిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత స్తబ్దుగా మారిపోయాడు. 2014 ఎన్నికలకు ముందు, తాను ఒక పార్టీ పెడుతున్నట్టు చెప్పుకొచ్చాడు. జనసేన ఆవిర్భావం కూడా జరిగింది. పవన్ ఇజం అనే ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించాడు. ఆతరువాత కొన్ని రోజుల్లో ఉన్న ఎన్నికలకు పార్టీ అప్పుడే సిద్ధంగా లేనందున టీడీపీ-బీజేపీ కూటమికి తన మద్దతు ప్రకటించి, ఆ కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించాడు. ఏ సమస్య మీదైనా  ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్, ఆ తరువాత రాజకీయ చిత్రపటంపైన కనబడ లేదు. పవన్ పార్ట్ టైం రాజకీయ నాయకుడంటూ అప్పటి ప్రతిపక్ష వైసీపీ ఎద్దేవా కూడా చేసింది. ఇక మధ్యలో అడపాదడపా ఉద్యమాలు చేసినా, ఆ ఫ్లోని మాత్రం కంటిన్యూ చేయలేకపోయాడు.

పవన్ కళ్యాణ్. కానీ మళ్ళీ 2019 ఎన్నికలు వచ్చేనాటికి మాత్రం పవన్ రాజకీయ క్షేత్రంలో బాగా యాక్టీవ్ అయ్యారు. పార్టీ పెట్టి ఐదేళ్లు గడిచినప్పటికీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం పై మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టలేదు. ఆయన ఎంతసేపటికీ కూడా వన్ మ్యాన్ షోలా పార్టీని నడిపాడు తప్ప ఏనాడు కూడా పార్టీ కమిటీలను ఏర్పాటు చేయడంలో ఆసక్తిని కనబరచలేదు. ఇక అలా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఘోర వైఫల్యం చెందింది. పవన్ కళ్యాణ్ కూడా పోటీచేసిన రెండు చోట్లా కూడా ఓడిపోయాడు. కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం గెలిచాడు. అలాంటి ఘోర వైఫల్యం తరువాత కూడా పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోనే ఉండి తేల్చుకుంటానని చెప్పాడు. చెప్పినట్టే ఇసుక దీక్ష చేసారు. వారికి మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. ఇలా ఎన్నికలయిపోయిన తరువాత నుండి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆయనకు ఒక ఆలంబన అవసరం. టీడీపీ వైపు చూద్దామంటే, వారే కుదేలయిపోయి ఉన్నారు. అయినప్పటికీ వారికి సంస్థాగత నిర్మాణం ఉండబట్టి రాజకీయంగా వచ్చిన నష్టం లేదు. కానీ చంద్రబాబే పార్టీని రక్షించుకోవడంలో తలమునకలై ఉన్నాడు.

ఇలాంటప్పుడు చంద్రబాబు తన పార్టీకి ఒకింత అండగా ఉంటాడని భావించాడు. బహుశా ప్రభుత్వంపై పోరాటం చేసేప్పుడు అన్ని పార్టీలు ఒక్కటవుతాయి కాబట్టి ఇలా అనిపించిందేమో, కానీ పవన్ టీడీపీకి దగ్గరగా ఉన్నదనేది మాత్రం వాస్తవం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే ప్రజలు పక్కనబెట్టారో, అలానే ప్రత్యేక హోదా ఇవ్వము అని తేల్చడంతో భారతీయ జనతా పార్టీని కూడా పక్కన పెట్టారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయంటేనే  ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చుఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం ఎలా సాధ్యపడిందనేది అందరి మదిలో మెదులుతున్న ఒక సవాల్. బీజేపీతో పొత్తు అంటే ప్రస్తుతానికి అది ఆత్మహత్యసదృశమే అవుతుంది. పవన్ కళ్యాణ్ ని ఎవరు ఒప్పించారు. ఎందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అనేది ఇప్పుడు జోరుగా నడుస్తున్న చర్చ. బీజేపీకి అంటే పవన్ కళ్యాణ్ లాంటి ఒక మాస్ లీడర్ కావలి కాబట్టి వారు పవన్ మీద ప్రేమ చూపెట్టడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కానీ పవన్ కళ్యాణ్ వెళ్లి కలవడం వెనుక మాత్రం ఒక జాతీయ పార్టీ సపోర్ట్ తోపాటు మరో అంశం కూడా దాగి ఉంది. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం, పార్టీని పటిష్టపరుచుకునేందుకు వారికి ఒక కేంద్ర మంత్రి పదవిని ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 
జనసేనకు ఒక మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం లేదు అనే చర్చకు కూడా ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. అంతే కాకుండా జనసేన పెరిగితే.. ఆ మైలేజ్ అంతా కూడా తమ క్రెడిట్లోకి వేసుకోవచ్చుఅని బీజేపీ భావిస్తుంది. ఇలాంటి అన్ని ఈక్వేషన్స్ నేపథ్యంలో జనసేనకు కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసేందుకు బీజేపీ అధినాయకత్వం డిసైడ్ అయింది. సరే మంత్రి పదవి ఇస్తారు. మరి జనసేనలో ఎవరు? చర్చనీయాంశం. దీనికి సమాధానం కావాలంటే.... ఒక ఆరు నెలలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. జులై 2019లో అనూహ్యంగా జనసేనలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న మాజీ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తండ్రి, నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరారు. అప్పట్లో అందరూ ఈ వయసులో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల ఎందుకు బీజేపీలో చేరవలిసి వచ్చిందని అనుకున్నారు.

వాస్తవానికి అప్పటి నుండి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి లోకి జనసేన ఎంట్రీకి ప్రణాళికలు మొదలయ్యాయి. తన తండ్రి ద్వారా బీజేపీకి జనసేనను దగ్గర చేసే పనిని నాదెండ్ల మనోహర్ తన భుజస్కంధాలపై వేసుకున్నాడు. అక్కడి నుండి మొదలు జనసేనను బీజేపీకి దగ్గర దగ్గరగా జరిపే ప్రయత్నం మొదలయింది. ఇలా జనసేనకు-బీజేపీకి మధ్య వారధిగా వ్యవహారాన్నంతా చక్కబెట్టాడు నాదెండ్ల. ఇలా ఈ పనంతా కష్టపడి చేసినందుకు నాదెండ్ల మనోహర్ కు కేంద్రమంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. ఇక్కడే మరో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జనసేనకు ఇచ్చినప్పుడు పవన్ కల్యాణే నేరుగా తీసుకోవచ్చు కదా? పవన్ కి 2014లోనే బీజేపీ కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది. కానీ పవన్ మాత్రం దానికి అప్పటి నుండి ఇప్పటివరకు సుముఖంగా లేరు. బహుశా అన్న చిరంజీవి ఎఫెక్ట్ ఏమో. ఈ  నేపథ్యంలోనే తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన నాదెండ్ల మనోహర్ పేరును కేంద్ర మంత్రి పదవికి ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర కాబినెట్ విస్తరణ ఉండనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: