హైదరాబాద్  తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యం లో ఐ సి సి ఆర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ, వంశీ ఇంటర్నేషనల్ సహకారంతో  తాన్ సేన్ త్యాగరాజ సంగీత నృత్యోత్సవాలు ఘనంగా జరిగాయి. శనివారం సాయంత్రం  వైభవంగా జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ మృదంగ  విద్వాంసులు పద్మశ్రీ  యెల్లా వెంకటేశ్వర రావు కు మృదంగ ప్రభాచార్య  పురస్కారాన్ని ప్రదానం చేశారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, శాస్త్రీయ సంగీత నృత్యాల ఔన్నత్యాన్ని అమెరికాలో చాటి చెబుతున్న గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అభినందనీయులని భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసిసిఆర్)  డైరెక్టర్ వై.లక్ష్మాజీ రావు అభినందించారు.

ఇండియా వచ్చి ఇక్కడ కూడా సంగీత నృత్యోత్సవాలు నిర్వహించడం  స్ఫూర్తి దాయకం అన్నారు.  మృద్వాంసురాలు ప్రభావతీ దేవి తమిరిశ జ్ఞాపకార్ధం మృదంగ ప్రభాచార్య పురస్కారంతో పద్మశ్రీ డాక్టర్ యెల్లా వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. సత్కారానికి పులకించిన డాక్టర్ యెల్లా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అనేక పురస్కారాలు అందుకున్నప్పటికి ప్రభావతి పేరిట నెలకొల్పిన పురస్కారం తాను స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకలో డాక్టర్ వనజా ఉదయ్, డాక్టర్ వంశీ రామరాజు, సీత మాడభూషి, ఇంద్రదేవ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సంగీత నృత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ మైసూర్ మంజునాథ్ కర్ణాటక రాగాలతో అమెరికా నుంచి విచ్చేసిన ఇంద్రదీప్ ఘోష్ హిందూస్థానీ రాగాలతో మేళవించి  ప్రదర్శించిన వయోలిన్ డ్యూయెట్  సంగీత ప్రియులను ఓలలాడించింది. పండిట్ రవిశంకర్ రూపొందించిన కీర్తనలను వయోలిన్ జుగల్బందీలో వినిపించి ఆకట్టుకున్నారు.హిందూస్థానీ లో యమన్, కర్ణాటక లో కళ్యాణి రాగం జోడించి  చేసిన జుగల్బందీ అలరించింది.అనంతరం ప్రముఖ నర్తకుడు పి.మృత్యంజయ శర్మ కూచిపూడి, నర్తకి ఆర్తి శంకర్ కథక్ తో నృత్య జుగల్బందీ చేసి హర్షద్వానాలు  అందుకున్నారు. రాగేశ్వరి  రాగం లో రుద్రాష్టకం, సూరదాస్ భజన కు వారిద్దరూ కలసి చేసిన నాట్యం ఆకర్షించింది.గ్లోబల్ క్రియేటివ్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక  సిఇఓ సీత మాడభూషి సమన్వయకర్త గా వ్యవహరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: