ఏపీలో ఇప్పుడు సవాళ్ల పర్వం కొనసాగుతోంది. రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్న చంద్రబాబు.. దమ్ముంటే జగన్ తన పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలిచి అప్పుడు రాజధాని మార్చుకోవాలని సవాల్ విసురుతున్నారు. అయితే ఈ సవాల్ పై వైసీపీ నేతలు కూడా అంతే దీటుగా సమాధానం చెబుతున్నారు.

 

చంద్రబాబుకు అంత దమ్ముంటే.. జగన్ రాజీనామా చేయడం కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి దమ్ముంటే.. మళ్లీ గెలవాలని చంద్రబాబుకు సవాల్ విసురుతున్నారు. అయితే ఇలా వైసీపీ నాయకులు ప్రతి సవాల్ విసరడం వెనుక ఓ లాజిక్ ఉంది. ఆ విషయాన్నే వారు నొక్కి చెబుతున్నారు. ఒక జనం ఇష్యూపై పోరాడుతున్నప్పడు అలా పోరాటం చేసే వారే రాజీనామా చేస్తారని వైసీపీ నాయకులు అంటున్నారు.

 

అందుకు ఉదాహరణగా వైసీపీ నేతలు కేసీఆర్ ను చూపిస్తున్నారు. తెలంగాణ కోసం టీఆర్ ఎస్ పార్టీ అనేక సార్లు రాజీనామాలు చేసిందని.. రాజీనామాలతోనే ఉప ఎన్నికలతోనే ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ ఉందని పలుసార్లు రుజువు చేసిందని వారు గుర్తు చేస్తున్నారు. చివరకు కేసీఆర్ తెలంగాణ సాధించాడంటే.. అందులో ఉప ఎన్నికల పాత్ర చాలా ఉందంటున్నారు.

 

ఇప్పుడు జై అమరావతి అంటున్న చంద్రబాబు కూడా కేసీఆర్ ను ఫాలో కావాలని.. కేసీఆర్ లా దమ్ముంటే.. వెంటనే పదవికి రాజీనామా చేసి ఉపఎన్నికలు వచ్చేలా చేయాలని వైసీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. అదీ నిజమే.. కేసీఆర్ అనేక సార్లు తెలంగాణ కోసం రాజీనామాలు చేశారు. చేసిన ప్రతిసారీ సంచలనం సృష్టించారు. చాలా సార్లు గెలిచారు.

 

కానీ కొన్ని సార్లు ఓడిపోయారు కూడా. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా తెలంగాణ వాదాన్ని కేసీఆర్ ఉప ఎన్నికల ద్వారా బతికించారు. తాను అనుకున్నది సాధించారు. మరి చంద్రబాబు కేసీఆర్ లా ఉప ఎన్నికల మంత్రం ప్రయోగించగలరా.. అంత దమ్ముందా.. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: