రాజధాని ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యమాలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు మద్దతు తెలుపుతున్నారు. వారి పోరాటం కోసం ఆయన జోలె పట్టుకుని ఊరూరా తిరుగుతూ విరాళాలు పోగు చేస్తున్నారు. పోరాడితే రాజధాని మార్పు నిర్ణయం ఆగిపోతుందని అమరావతి రైతులకు చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.

 

అయితే మరోవైపు జగన్ సర్కారు విశాఖను రాజధానిగా చేసేందుకు చురుకుగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమయంలో రాజధాని రైతులు తమకు కావలసిన పరిహారం కానీ..ఇతర డిమాండ్లు కానీ వినిపించడం వల్ల వారి ఇబ్బందులు కొంత వరకూ తొలగుతాయి. కానీ.. చంద్రబాబునే నమ్ముకుంటే.. వారు నిండా మునగడం ఖాయం అంటున్నారు వైసీపీ నేతలు. గతంలోనూ చంద్రబాబు రాష్ట్ర విభజన సమయంలో ఇలాగే ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణకు చంద్రబాబు అడ్డుపడుతున్నారని, ఆయన ట్రాప్‌లో రైతులు ఎవరు పడొద్దని ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు హితబోద చేశారు. దయచేసి రైతులెవరు ఆయన ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్‌ నాయకత్వంలో నిజమైన రైతులకు ఎప్పటికి అన్యాయం జరగదని, నిజంగానే రైతుకు నష్టం జరిగితే వారి సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అంబటి వెల్లడించారు.

 

అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటని అంబటి ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ప్రాంతీయ విభేదాలు రాకూడదనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతిలో భూములు కొన్నవారే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే బాబుకు వచ్చే నష్టమేంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కేవలం తన ఆస్తులు పోతాయన్న భయంతోనే ఉద్యమం చేపట్టారని విమర్శించారు. అందుకోసమే బాబు జోలే పట్టుకొని నాటకం ఆడుతున్నారని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: