అందని ద్రాక్ష పుల్లన అంటారు. అలాగే తమకు నచ్చని పరిణామాలు జరిగినప్పుడు.. సమీప భవిష్యత్తుతో తాము ఆశించింది జరుగుతుందని నమ్మకం లేనప్పుుడు.. తమ ఆప్తులకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నప్పుడు వైరాగ్యం రావడం సహజం.. అప్పటి వరకూ ఎంతో ఇష్టమైంది కూడా ఇక అప్పుడు వెగటు పుడుతుంది.. ఇప్పటి వరకూ ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం వంటి పదాలే విన్నాం.. ఇక ఇప్పుడు రాజకీయ వైరాగ్యం కూడా చూడొచ్చు.

 

ఈ రాజకీయ వైరాగ్యాన్ని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన తాజా కథనంలో భలేగా రాశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఆయన ప్రస్తావిస్తూ.. బీజేపీ – జనసేన మధ్య ఇప్పుడు కుదిరిన పొత్తు అక్కడికే పరిమితమైతే దానివల్ల ఆ రెండు పార్టీలకు పెద్దగా లాభించేది ఏమీ ఉండదన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం అంటూ రాశారు. రాజకీయ పార్టీల లాభనష్టాల విషయం ఎలా ఉన్నా కమలం – సేన కలయిక వల్ల రాజధాని రైతులకైనా ఉపశమనం లభిస్తుందో లేదో వేచిచూడాలన్నారు.

 

అంత వరకూ బాగానే ఉంది. ఇక అక్కడ నుంచి మొదలైంది వైరాగ్యం. " అయినా పరపతి, విశ్వసనీయత కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ఎవరితో కలిసినా, విడిపోయినా, ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఈ పరిస్థితులలో ప్రజలే తమ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించుకోవడానికై ఉద్యుక్తులు కావడం ఒక్కటే మార్గం.. అంటూ ముక్తాయించారు.

 

తాజాగా రాధాకృష్ణ రాతలు చూస్తుంటే.. తమ అభిమాన నాయకుడు చంద్రబాబే అధికారంలో లేనప్పుడు.. ఈ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటే మాకేం.. లేకపోతే మాకేం.. ఎవరు ఎటు పోతే మాకేం.. మా బాబు మాత్రం అధికారంలో లేడు కదా.. అని నిట్టూరుస్తున్నట్టుగా ఉంది. పాపం.. చంద్రబాబుకు వరుసగా దెబ్బలు తగలడం.. ఆయనకు సమీప భవిష్యత్తులో మంచి రోజులు కనిపించకపోవడంతో పాపం రాధాకృష్ణ చాలా బాధలో ఉన్నట్టున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: