సత్తుపల్లి.. ఖమ్మం జిల్లాలో ఈ మునిసిపిపాలిటీ పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఈ మన్సిపాలిటీలో ఇక్కడ మొత్తం పాతిక వేల మంది ఓటర్లు ఉన్నారు. సత్తుపల్లిలో మొత్తం వార్డులు 23 ఉన్నాయి.. వీటిలో ఆరింటిని ఇప్పటికే టీఆర్ ఎస్ ఏకగ్రీవం చేసేసుకుని ముందు వరుసలో ఉంది. సత్తుపల్లి మునిసిపిపాలిటీలోని 23 వార్డులకు 04, 05, 06, 08, 17, 18 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.

 

మిగిలిన 17 వార్డుల కోసం టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. మొత్తం 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ సాధారణంగా టీఆర్ఎస్ విజయం ఏకపక్షంగా జరగాలి. ఎందుకంటే.. ఇక్కడ బలమైన నేతలలైన స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ సీఎం జలగం వెంగళరావు తనయులు జలగం ప్రసాదరావు, వెంకటరావు.. అంతా ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు.

 

ఇంత మంది దిగ్గజాలు ఉన్నప్పడు విజయం ఏకపక్షం కావాలి. కానీ.. చివరి రోజుల్లో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి కొందరు బలమైన స్థానికనేతలు బీజేపీలో చేరడంతో ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ ఈ పార్టీ 12 వార్డుల్లోనే పోటీ చేస్తోంది. అయినా అందరి దృష్టీ బీజేపీ పైనే. కాంగ్రెస్‌ నుంచి బీజేపీ చేరిన ఉడతనేని అప్పారావు అధికార పార్టీలో దడ పుట్టిస్తున్నారు.

 

ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వచ్చిన సమయంలో పట్టణంలో బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ఈ పరిణామం రాష్ట్ర, జిల్లా, స్థానిక భాజపా నేతలను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ పట్టణం నూతన జవసత్వాలను కోరుకుంటోందని, రాజకీయ మార్పులకు నాంది సత్తుపల్లి నుంచే పలకడం తథ్యమని బీజేపీ నాయకులు భరోసాగా ఉన్నారు. ఇక్కడ బీజేపీ ఛైర్మన్ స్థానం దక్కించుకోలేకపోయినా.. టీఆర్ఎస్ కు కొన్ని వార్డుల్లో గట్టి పోటీ ఇవ్వగలుగుతుందనేది స్థానికుల మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: