జ‌న‌సేన రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసే కీల‌క నిర్ణ‌య‌మైన బీజేపీతో పొత్తు నిర్ణ‌యం పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే తీసుకున్న సంగ‌తి తెలిసిందే. కాషాయ పార్టీతో క‌లిసి సాగాల‌ని, 2024లో అధికారం చేజిక్కించుకోవాల‌ని ప‌వ‌న్ డిసైడ‌య్యారు. దీనిపై స‌హ‌జంగానే విప‌క్షాలు, గ‌తంలో జ‌న‌సేన పార్టీ మిత్ర‌ప‌క్షాలు త‌మ‌దైన శైలిలో స్పందించారు. అయితే, ఈ విష‌యంలో పార్టీ శ్రేణుల్లో కొంత అస్ప‌ష్ట‌త ఉంది. దాన్ని తొల‌గించేందుకు ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పి.ఎ.సి.) అత్యవసర సమావేశాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. 

 

జనసేన పార్టీ మీడియా విభాగం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, విజయవాడలోని పార్టీ  కార్యాలయంలో సోమ‌వారం సాయంత్రం అయిదు గంటలకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాజధాని అమరావతిపై పార్టీ పరంగా తీసుకోవలసిన నిర్ణయాలు, బీజేపీతో పొత్తు తరువాత కలసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

 


కాగా, ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ వైఖ‌రి, పొత్తు గురించి తెలియ‌జెప్పిన సంగ‌తి తెలిసిందే. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గ‌త వారం పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య‌నేత‌ల‌తో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వ‌హించారు.  బీజేపీతో పొత్తు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా జనసేన పార్టీ అధ్యక్షుడు నేత‌ల‌ను ఆదేశించారు.  బీజేపీతో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై కార్యకర్తల సమావేశాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ చర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం. దీనికంటే ముందు నిర్వ‌హించ‌బోయే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పార్టీ నేత‌ల నుంచి ప‌వ‌న్ సూచ‌న‌లు తీసుకోవ‌డం, కార్యాచ‌ర‌ణ రూపొందించ‌డం వంటి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: